జూన్ 21 వరకు రాష్ట్రంలో అన్ని రకాల రోడ్డు ట్యాక్స్‌లను రద్దు చేస్తున్నట్లు సీఎం మమత ప్రకటించారు. ఉచిత రేషన్ బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని జూన్ 21 వరకు కొనసాగిస్తామని తెలిపారు. 1.5 లక్షల మంది శరణార్థులకు దశలవారీగా భూ పంపిణీ చేయనున్నట్లు ప్రకటించారు. 45 లక్షల నిర్మాణ రంగ, రవాణా రంగ కార్మికులకు నెలకు రూ.1000 చొప్పున భృతి అందించనున్నట్లు తెలిపారు.
‘జువశక్తి‘ అనే కొత్త పథకాన్ని ప్రకటించారు. ఇందులో భాగంగా ప్రతి మూడేళ్లకు గాను 10 వేల మంది విద్యార్థులను ఎంపిక చేసి ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేయడానికి అవకాశం (ఇంటర్న్‌షిప్) కల్పించనున్నట్లు తెలిపారు. తద్వారా వారిలో పని నైపుణ్యాలను మెరుగు పరిచేందుకు ప్రోత్సహించనున్నట్లు సీఎం మమత వివరించారు.
పేదలకు తక్కువ ధరకు ఆహారం అందించే పథకం కోసం రూ.100 కోట్లు కేటాయించారు. పలు కొత్త రోడ్లు, వంతెనల నిర్మాణాలకు సంబంధించిన ప్రాజెక్టులకు ప్రత్యేక నిధులు కేటాయించారు. మొత్తం 29,96,88 కోట్ల రూపాయలతో బడ్జెట్ ప్రవేశపెట్టారు.
రూ.1500 కోట్లతో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు 20 లక్షల పక్కా గృహాలు నిర్మించి ఇస్తామని సీఎం మమతా బెనర్జీ హామీ ఇచ్చారు. రూ.10 కోట్ల వ్యయంతో కోల్‌కతా పోలీస్ ఫోర్స్‌లో నేతాజీ బెటాలియన్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. 9 లక్షల మంది విద్యార్థులకు ట్యాబ్స్ ఇవ్వనున్నట్లు ప్రకటించారు.
అసెంబ్లీ బడ్జెట్ ప్రారంభ సమావేశానికి గవర్నర్‌ను ఆహ్వానించకుండా సీఎం మమతా బెనర్జీ మరో సంచలనానికి తెర తీశారు. ఈ అంశంపై బీజేపీ ఎమ్మెల్యేలు సభలో నిరసన తెలిపారు. మమతా బెనర్జీ తీరును తప్పుబడుతూ బీజేపీతో పాటు కాంగ్రెస్, వామపక్ష సభ్యులు కూడా సభ నుంచి వాకౌట్ చేశారు. ‘నాపై విశ్వాసం ఉంచండి. నేను మీకు అంకితభావంతో నిస్వార్థ సేవలు అందిస్తా’ అంటూ రవీంద్రనాథ్ ఠాగూర్ కవితతో మమతా బెనర్జీ తన బడ్జెట్ ప్రసంగాన్ని ముగించడం విశేషం.