
వ్యాక్సిన్ తీసుకున్న వారానికే ఓ నర్సు వైరస్ బారినపడ్డాడు. అమెరికాలోని కాలిఫోర్నియాలో ఈ ఘటన చోటు చేసుకుంది. మాథ్యూ డబ్ల్యూ అనే వ్యక్తి కాలిఫోర్నియాలోని రెండు వేర్వేరు హాస్పిటళ్లలో నర్సుగా పనిచేస్తున్నాడు. కరోనా రోగులకు విలువైన సేవలు అందిస్తున్నాడు. కరోనా వైరస్ బారినపడకుండా అతడు డిసెంబర్ 18న ఫైజర్ (
Pfizer Vaccine) టీకా తీసుకున్నాడు. టీకా తీసుకున్న ఫోటోను అదే రోజు తన ఫేస్బుక్ ఖాతా ద్వారా షేర్ చేశాడు. టీకా వేసిన చోట కాస్త నొప్పిగా అనిపించిందని.. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవని తెలిపాడు. కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వారం రోజులకు మ్యాథ్యూకు కొవిడ్-19 పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.
ఫైజర్ వ్యాక్సిన్ తీసుకున్న 6 రోజులకు మ్యాథ్యూ తన కుటుంబసభ్యులతో కలిసి క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుపుకొన్నాడు. ఆ తర్వాతి యధావిధిగా హాస్పిటల్లో విధుల నిమిత్తం వెళ్లాడు. కొవిడ్ కేర్ యూనిట్లో పనిచేశాడు. అదే రోజు రాత్రి అతడు నరాల నొప్పి, అలసట, చలిజ్వరం లాంటి లక్షణాలతో బాధపడ్డాడు. మరుసటి రోజు కరోనా పరీక్ష చేసుకోగా.. పాజిటివ్‌గా తేలింది. అమెరికాకు చెందిన ఏబీసీ న్యూస్ ఈ మేరకు ఓ కథనాన్ని ప్రచురించింది.
అది ఊహించని విషయం కాదు..
అయితే.. వ్యాక్సిన్ తీసుకున్నా వైరస్ బారినపడటం ఊహించని పరిణామం కాదని నిపుణులు చెబుతున్నారు. ఒకసారి వ్యాక్సిన్ తీసుకున్నాక 10 నుంచి 14 రోజుల తర్వాత అది పనిచేయడం ప్రారంభం అవుతుందని అంటువ్యాధుల నిపుణుడు క్రిస్టియన్ రామర్స్ తెలిపారు.
‘వ్యాక్సిన్ తీసుకున్న 10 నుంచి 14 రోజుల తర్వాత మన శరీరంలో ప్రతిరక్షకాలు ఉత్పత్తి అవుతాయి. అంతేకాకుండా.. ఫైజర్ వ్యాక్సిన్‌తో పలు టీకాలు రెండు డోసులు తీసుకోవాల్సి ఉంటుంది. మొదటి డోసు వల్ల కేవలం 50 శాతం మాత్రమే రక్షణ లభిస్తుంది. రెండో డోసు తీసుకున్న తర్వాత 95 శాతం వరకు రక్షణ లభిస్తుంది. అందువల్ల వ్యాక్సిన్ రెండో డోసు తీసుకునేంత వరకు జాగ్రత్తలు పాటించాలి’ అని రామెర్స్ వివరించారు.
కేంద్ర ప్రభుత్వం కూడా ఇదే విషయాన్ని చెబుతోంది. వ్యాక్సిన్ తొలి డోసు వేసుకోగానే సరిపోదని.. రెండో డోసు తీసుకునేంత వరకు జాగ్రత్తగా ఉండాలని ఇప్పటికే మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ విషయం గుర్తుంచుకోకపోతే.. మ్యాథ్యూ లాంటి అనుభవమే ఎదురుకావొచ్చు.. జాగ్రత్త!
Like this:
Like Loading...