up women murder: యూపీలో నిర్భయ తరహా ఘటన.. అత్యంత పాశవికంగా మహిళపై దాడిచేసిన మృగాళ్లు – middle aged woman brutally murdered like nirbhaya in uttar pradesh

0
24


ఉత్తర్ ప్రదేశ్‌లో మహిళలపై అఘాయిత్యాలకు అడ్డుకట్టపడటం లేదు. దేశవ్యాప్తంగా సృష్టించిన ‘నిర్భయ’ తరహా ఘటన తాజాగా యూపీలో చోటుచేసుకుంది. ఓ మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడి, అత్యంత క్రూరంగా హత్యచేశారు. మృగాళ్ల దాష్టీకానికి ఓ వివాహిత బలైపోయింది. బాధితురాలు దైవదర్శనానికి వెళ్లొస్తుండగా కామాంధులు అపహరించి అత్యాచారానికి పాల్పడ్డారు. అంతటితో ఆగక అత్యంత కిరాతకంగా ప్రవర్తించారు. బాధితురాలి పక్కటెముకలు, కాళ్లు విరిచి, జననాంగాలను గాయపరిచారు. బదౌన్‌ జిల్లాలో మూడు రోజుల కిందట జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

పోలీసుల కథనం ప్రకారం.. బదౌన్‌ జిల్లాలోని ఉగయితీ ప్రాంతానికి చెందిన బాధితురాలు (50) అంగన్వాడీ కార్యకర్తగా పనిచేస్తోంది. ఆదివారం సాయంత్రం స్థానిక ఆలయానికి వెళ్లింది. చాలా సమయం గడిచిపోయినా ఆమె ఇంటికి తిరిగి రాకపోయేసరికి కుటుంబసభ్యులు ఆందోళన చెందారు. ఆమె కోసం ఊరంతా గాలించినా ప్రయోజనం లేకపోయింది. చివరికి అర్ధరాత్రి వేళ అపస్మారక స్థితిలో ఉన్న ఆ మహిళను ఆలయ పూజారి సహా మరో ఇద్దరు వ్యక్తులు ఇంటికి తీసుకొచ్చినట్లు బాధితురాలి కుమారుడు తెలిపారు.

ఏం జరిగిందని మహిళ కుటుంబసభ్యులు ఆ పూజారిని అడిగితే.. ఆమె ప్రమాదవశాత్తు బావిలో పడిపోయిందని, కేకలు విని తాము రక్షించిన తీసుకొచ్చామని చెప్పాడు. అప్పటికే తీవ్ర రక్తస్రావమైన అపస్మారక స్థితిలో ఉన్న ఆ మహిళ ఆసుపత్రికి తీసుకెళ్లేలోపు ప్రాణాలు కోల్పోయింది. అమె ఒంటిపై గాయాలుండటంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించగా దిగ్భ్రాంతికర విషయాలు బయటపడ్డాయి. మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడి, అత్యంత దారుణంగా వ్యవహరించినట్టు పోస్ట్‌మార్టం నివేదికలో తేలింది. బాధితురాలి పక్కటెముకలు, కాళ్లను విరగ్గొట్టి, ఊపిరితిత్తులపై బలమైన వస్తువుతో దాడిచేసినట్టు వెల్లడయ్యింది. అంతేకాదు, ప్రయివేట్ భాగాలను కూడా మృగాళ్లు దారుణంగా గాయపర్చినట్లు బయటపడింది.

కుటుంబసభ్యుల ఫిర్యాదుతో ఆలయ పూజారి, మరో ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుల కోసం గాలిస్తున్నామని, ఇద్దరిని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు.

బాధితురాలి కుమారుడు స్థానిక మీడియాతో మాట్లాడుతూ.. ‘పూజారి సహా మరో ఇద్దరు వారి వాహనంలోనే తీసుకొచ్చారు.. అప్పటికే మా అమ్మ చనిపోయింది.. ఇంటి గుమ్మం దగ్గర వాహనంలో నుంచి దింపి తక్షణమే అక్కడ నుంచి వాళ్లు వెళ్లిపోయారు’ అని తెలిపాడు. గ్రామంలోని ఆలయానికి మా అమ్మ రోజూ వెళ్తుందని, ఆదివారం సాయంత్రం కూడా వెళ్లిందని అన్నాడు. రాత్రి 11.30 గంటల ప్రాంతంలో అపస్మారక స్థితిలో ఉండగా తీసుకొచ్చారని తెలిపాడు.

అయితే, ఈ వ్యవహారంలో స్థానిక పోలీసుల నిర్లక్ష్యం ఉందని స్పష్టమవుతోంది. బాధితురాలి కుటుంబసభ్యులు ఫిర్యాదుచేసినా, సకాలంలో స్పందించలేదు. దీనిపై విమర్శలు వెల్లువెత్తడంతో స్థానిక పోలీస్ స్టేషన్ ఇంఛార్జ్‌ను బదౌన్ ఎస్పీ సస్పెండ్ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here