terror plan in jammu: మరో పుల్వామా తరహా దాడికి కుట్ర.. సైన్యం అప్రమత్తతో తప్పిన పెను ప్రమాదం – on pulwama 2nd anniversary, jammu and kashmir police nabs man with 6.5kg ied

0
31


మరో పుల్వామా తరహా దాడికి ఉగ్రవాదులు పన్నిన కుట్రను భద్రతా బలగాలు భగ్నం చేశాయి. పుల్వామా ఆత్మాహుతి దాడి జరిగి రెండేళ్ల పూర్తయిన సందర్భంగా ముష్కరుల మరోసారి పేలుళ్లకు పథకం వేశారు. జమ్మూ-కశ్మీర్‌లో జనసమ్మర్థ ప్రాంతాల్లో భారీ పేలుళ్లకు ఉగ్రవాదులు కుట్ర పన్నినట్టు నిఘా వర్గాలు గుర్తించి, భద్రతా బలగాలను అప్రమత్తం చేశాయి. జమ్మూ బస్టాండ్‌లో పేలుడు పదార్థాలతో ఓ నర్సింగ్‌ విద్యార్థిని, ఈ కుట్రలో భాగస్వామ్యం ఉన్న మరో ముగ్గురిని పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు.

నిఘా వర్గాలు అప్రమత్తం చేయడంతో సైన్యం ఆదివారం విస్తృత తనిఖీలు నిర్వహించింది. శనివారం రాత్రి జమ్మూ బస్టాండ్‌లో ప్రయాణికుల మధ్య పెద్ద బ్యాగుతో అనుమానాస్పదంగా తిరుగుతున్న నర్సింగ్‌ విద్యార్థిని గుర్తించి అరెస్ట్ చేశారు. ఆ బ్యాగులో దాదాపు 7 కిలోల ఐఈడీ, ఆరు తుపాకులు లభ్యమయ్యాయి. పట్టుబడిన విద్యార్థిని పుల్వామాలోని నేవాకు చెందిన సొహైల్‌ బషీర్‌ షాగా గుర్తించారు.

చండీగఢ్‌లో నర్సింగ్‌ చదువుతున్న సొహైల్ బషీర్ పాకిస్థాన్‌కు చెందిన అల్‌-బదర్ ఇస్లామిక్‌ ఉగ్రవాద సంస్థ మార్గదర్శకత్వంలో పేలుడు పదార్థాలతో జమ్మూకి చేరుకున్నాడు. జమ్మూ జోన్ ఐజీపీ ముఖేశ్ సింగ్ మాట్లాడుతూ.. పుల్వామా ఆత్మాహుతి దాడి జరిగి రెండేళ్లు పూర్తవుతున్నందున మరోసారి భారీ పేలుళ్లకు ఉగ్రవాదులు కుట్ర పన్నినట్టు నిఘా వర్గాల ద్వారా స్పష్టమైన సమాచారం అందిందని అన్నారు. శనివారం రాత్రి సొహైల్ అనే నర్సింగ్ విద్యార్ధిని అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు.

జమ్మూలో ఐఈడీని అమర్చాలని పాకిస్థాన్‌కు చెందిన అల్-బదర్ తంజీమ్ ఉగ్రవాద సంస్థ నుంచి ఆదేశాలు అందాయని విచారణలో వెల్లడించినట్టు ఐజీ పేర్కొన్నారు. ‘అరెస్టయిన వ్యక్తికి మూడు నాలుగు చోట్ల ఐఈడీ అమర్చాలని టార్గెట్ ఇచ్చారు.. రఘునాథ్ ఆలయం, బస్టాండ్, రైల్వే స్టేషన్, జమ్మూ జ్యువెల్లరీ మార్కెట్‌‌లో పేలుళ్లకు వ్యూహరచన చేశారు. పేలుళ్లు పూర్తయ్యాక విమానంలో శ్రీనగర్‌ చేరుకోవాలన్నది వారి ప్రణాళిక. శ్రీనగర్‌లో అతడి తీసుకెళ్లేందుకు సిద్ధంగా ఉన్న అల్‌-బదర్ స్లీపర్‌సెల్‌ ఉగ్రవాది షహీల్‌ ఖాన్‌, ఈ కుట్రతో సంబంధం ఉన్న విద్యార్థులు సహ విద్యార్థులు క్వాజీ వాసిం, అబిద్‌ నబీలను కూడా శ్రీనగర్‌లో అరెస్టు చేశాం’ అని ముఖేష్‌ సింగ్‌ వివరించారు.

సాంబలో 15 చిన్న ఐఈడీలు, ఆరు తుపాకులను శనివారం రాత్రి పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు ఐజీపీ తెలిపారు. రోజువారీ పెట్రోలింగ్‌లో భాగంగా సాంబలోని రఖ్ ఝంగ్ నల్లాహ్ వద్ద రెండు అనుమానాస్పద ప్యాకెట్లను సైన్యం గుర్తించిందన్నారు. అందులో ఆరు తుపాకులు, 12 పిస్టల్ మ్యాగజైన్స్, 179 లైవ్ పిస్టల్ రౌండ్స్, ఐఈడీలను తయారుచేయడానికి వాడే పదార్థాలను 15 వైట్ బాటిళ్లలో గుర్తించినట్టు పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here