ప్రధానాంశాలు:
- మను యజ్ఞ దర్శకత్వంలో రూపొందుతున్న ‘అనగనగా ఒక రౌడీ’
- రేపు సుమంత్ పుట్టినరోజు సందర్భంగా కొత్త పోస్టర్ విడుదల
- విశాఖపట్నం రౌడీ వాల్తేరు శ్రీనుగా కనిపించనున్న సుమంత్
మను యజ్ఞ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఏక్‌దోతీన్ ప్రొడక్షన్స్ పతాకంపై గార్లపాటి రమేష్, డా. టీఎస్ వినీత్ భట్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ చిత్రం విశేషాలను దర్శకుడు తెలియజేశారు. ‘‘సుమంత్ కెరీర్లో ఇదొక వైవిధ్యమైన చిత్రం. సుమంత్ పాత్ర రొటీన్‌కు భిన్నంగా వుంటుంది. కొత్తదనం కోరుకునే ప్రేక్షకులకు ఆయన పాత్ర తప్పకుండా నచ్చుతుంది. వాల్తేరు శ్రీనుగా, విశాఖపట్నం రౌడీగా ఆయన అభినయం అందర్ని అలరించే విధంగా వుంటుంది’’ అని దర్శకుడు మను అన్నారు.
వైజాగ్‌లో జరిగే చివరి షెడ్యూల్‌తో చిత్రీకరణ పూర్తవుతుందని చెప్పారు దర్శకుడు. ఐమా నాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో మధునందన్, ధన్‌రాజ్, కళ్యాణ్ చక్రవర్తి, హైపర్ ఆది, మిర్చి కిరణ్, ప్రభ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం మార్క్ కె. రాబిన్ సమకూరుస్తున్నారు. విజయ్.కె.బి సహ నిర్మాత. రచన, దర్శకత్వం మను యజ్ఞ.
ఇదిలా ఉంటే, సెకండ్ ఇన్నింగ్స్‌లో సుమంత్ మంచి జోరుమీదున్నారు. వరుస సినిమాలతో సిద్ధమవుతున్నారు. ఆయన హీరోగా నటించిన ‘కపటధారి’ సినిమా ఫిబ్రవరి 19న విడుదలవుతోంది. క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాలో సుమంత్ ట్రాఫిక్ పోలీస్ ఎస్ఐగా కనిపించనున్నారు. కన్నడ చిత్రం ‘కావలుధారి’కి ఇది రీమేక్. ప్రదీప్ కృష్ణమూర్తి ఈ సినిమాకు దర్శకుడు.