Sreekaram Teaser: శర్వానంద్ ‘శ్రీ‌కారం’ టీజ‌ర్‌: మళ్లీ అదే పాత సింపథీ.. వర్కౌట్ అవుతుందా? – mahesh babu launches sharwanand sreekaram teaser

0
16


ప్రధానాంశాలు:

  • ‘శ్రీకారం’ టీజర్‌ను విడుదల చేసిన మహేష్ బాబు
  • వ్యవసాయం నేపథ్యంలో రూపొందిన ‘శ్రీకారం’
  • చెప్పిన సమయం కన్నా ఆసల్యంగా వచ్చిన టీజర్

యంగ్ హీరో శ‌ర్వానంద్ న‌టించిన లేటెస్ట్ ఫిల్మ్ ‘శ్రీ‌కారం’‌. కిశోర్ బి దర్శకత్వం వహించిన ఈ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌లో హీరోయిన్‌గా ప్రియాంకా అరుళ్ మోహ‌న్ (‘నానీస్ గ్యాంగ్ లీడ‌ర్’ ఫేమ్‌) న‌టించారు. 14 రీల్స్ ప్లస్‌ బ్యాన‌ర్‌పై రామ్ ఆచంట‌, గోపి ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మ‌హాశివ‌రాత్రి కానుక‌గా మార్చి 11న ‘శ్రీ‌కారం’ను థియేట‌ర్లలో విడుద‌ల చేయ‌నున్నారు.

ఇదిలా ఉంటే, ఈ సినిమాను టీజర్‌ను మంగళవారం విడుదల చేశారు. సూపర్ స్టార్ మహేష్ బాబు చేతుల మీదుగా మంగళవారం సాయంత్రం 4:05 గంటలకు విడుదల చేస్తామని చిత్ర నిర్మాణ సంస్థ ప్రకటించింది. కానీ, టీజర్ అనుకున్న సమయానికి విడుదల కాలేదు. కారణాలు ఏమిటో తెలీదు కానీ సుమారు రెండు గంటలు ఆలస్యంగా టీజర్ విడుదలైంది. సాయంత్రం 6 గంటల సమయంలో మహేష్ బాబు ‘శ్రీకారం’ టీజర్‌ను ట్విట్టర్ ద్వారా లాంచ్ చేశారు. చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు.

‘శ్రీకారం’ను నిజ జీవిత ఘటనల ఆధారంగా తీర్చిదిద్దినట్టు టీజర్‌లో తెలియజేశారు. వ్యవసాయం, రైతు గొప్పదనం నేపథ్యంలో ఈ సినిమా రూపొందినట్టు టీజర్‌ చూస్తే అర్థమవుతోంది. టీజర్‌లో వాయిస్ ఓవర్, డైలాగులు చాలా బాగున్నాయి. హీరో క్యారెక్టరైజేషన్ ఎలా ఉండబోతుందో తెలియజేస్తున్నాయి.

నా అంతటి నటి ఈ భూమి మీద లేదు.. ఇది నా సవాల్: కంగనా రనౌత్
‘‘ఒక హీరో త‌న కొడుకుని హీరోని చేస్తున్నాడు.. ఒక డాక్టర్ త‌న కొడుకుని డాక్టర్‌ని చేస్తున్నాడు.. ఒక ఇంజ‌నీర్ త‌న కొడుకుని ఇంజ‌నీర్‌ని చేస్తున్నాడు.. కానీ ఒక రైతు మాత్రమే త‌న కొడుకుని రైతుని చేయ‌డం లేదు. ఈ ఒక్కటీ.. నాకు జ‌వాబులేని ప్రశ్నగానే మిగిలిపోయింది’’ అంటూ శర్వానంద్ చెప్పే వాయిస్ ఓవర్ టీజర్‌కు హైలైట్. ‘‘తినేవాళ్లు మ‌న నెత్తిమీద జుట్టంత ఉంటే, పండించేవాళ్లు మూతిమీద మీస‌మంత కూడా లేరు’’ అని శర్వానంద్ టీజర్ ఆఖిరలో చెప్పే డైలాగ్ మరో హైలైట్.

శ‌ర్వానంద్ మాట‌ల్ని బ‌ట్టి ఆయ‌న ఒక రైతు కొడుక‌నీ, తండ్రి బాట‌లో తాను కూడా రైతుగా మారేందుకు శ్రీ‌కారం చుట్టాడ‌నీ ఈజీగా అర్థం చేసుకోవ‌చ్చు. అయితే రైతుగా అత‌ని ప్రయాణం సాఫీగా సాగిందా, ఏమైనా అడ్డంకులు ఎదుర‌య్యాయా? అస‌లు బాగా చ‌దువుకొని కూడా రైతు కావాల‌ని అత‌ను ఎందుకు నిర్ణయించుకున్నాడు? అనే ఆస‌క్తిక‌ర ప్రశ్నలకు సినిమా స‌మాధానం చెప్పనుంది.

సత్యదేవ్ కొడుకు ఫస్ట్ బర్త్‌డే.. ఏంటీ, అన్నకు పెళ్లయి పిల్లోడు ఉన్నాడా?
శ‌ర్వానంద్ నోటి నుంచి వ‌చ్చిన ఈ రెండు డైలాగులే సినిమాలో సంభాష‌ణ‌లు ఎంత ఇంప్రెసివ్‌గా ఉండ‌నున్నాయో తెలియ‌జేస్తున్నాయి. బుర్రా సాయిమాధ‌వ్ క‌లం మ‌రోసారి త‌న ప‌నిత‌నం ఎలాంటిందో ఈ సినిమాలో చూపించనుందని చిత్ర యూనిట్ చెబుతోంది. అలాగే ‘శ్రీ‌కారం’ మూవీ విజువ‌ల్ బ్యూటీగా ఉంటుంద‌నేందుకు టీజ‌ర్‌లోని విజువ‌ల్స్ ఓ శాంపిల్‌. జె. యువ‌రాజ్ సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి అద‌న‌పు ఆక‌ర్షణ‌.

అలాగే, మిక్కీ జే మేయర్ సంగీతం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే విడుదలైన ‘భలేగుంది బాలా’, ‘సందళ్లే సందళ్లే సంక్రాంతి సందెళ్లే’ పాటలు సంగీత ప్రియులను అలరించాయి. ఇక ఈ సినిమాలో రావు ర‌మేష్‌, ఆమ‌ని, వీకే న‌రేష్‌, సాయికుమార్‌, ముర‌ళీ శ‌ర్మ, స‌త్య, స‌ప్తగిరి వంటి మంచి నటులు నటించారు. ఇవన్నీ బాగానే ఉన్నా వ్యవసాయం నేపథ్యమే అనుమానాలకు తావిస్తోంది. రైతన్నపై సానుభూతి చూపిస్తూ, వ్యవసాయం గొప్పతనాన్ని తెలియజేస్తూ ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. వాటిలో కొన్ని సూపర్ హిట్ అయితే, కొన్ని బోల్తా కొట్టాయి. మరి ఈ ‘శ్రీకారం’ ఏమవుతుందో చూడాలి!

శర్వానంద్ ‘శ్రీకారం’ టీజర్: రైతన్న నేపథ్యం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here