ప్రధానాంశాలు:
- విడుదలకు సిద్దమైన నితిన్ ‘చెక్’
- ఘనంగా ప్రీ రిలీజ్ ఈవెంట్
- పదునైన మాటలతో అంచనాలకు రెక్కలు కట్టిన రాజమౌళి
వేదికపై మాట్లాడటానికి ముందు తొలి టికెట్‌ను రాజమౌళి, వరుణ్ తేజ్ కొనుగోలు చేశారు. అనంతరం రాజమౌళి మాట్లాడుతూ.. ”ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లో అందరి మాటలు విన్న తర్వాత చెక్ సినిమాకు కల్యాణీ మాలిక్ మంచి మ్యూజిక్ ఇచ్చారని చాలామంది మాట్లాడినట్లు అర్ధమైంది. ఈ సినిమాలో ఒక్క పాటను విన్నాను. కల్యాణీ మాలిక్ అద్భుతంగా చేశారు. ఆ ఒక్క పాట సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్తుంది. చందుకి ఇది తొలి ప్రీ రిలీజ్ ఈవెంట్ అనుకొంటాను. అందుకే ఆయన చాలా టెన్షన్‌తో ఉన్నారు.
టీజర్ చూడగానే ఎప్పుడప్పుడు థియేటర్‌కి వెళ్లి సినిమా చూడాలి అనే ఫీల్ తెప్పించిన తొలి చిత్రమిది. సినిమాలో చెస్ కథను నేపథ్యంగా తీసుకోవడం, సినిమా అంతా జైలులోనే తీయడం ఇంట్రెస్ట్ కలిగించింది. ఈ చెక్ సినిమా క్లాస్, మాస్ అనే హద్దులను చెరిపివేస్తుంది. ఇక నితిన్ చాలా యేళ్లుగా ఒకే రకమైన సినిమాలు చేస్తాడనే విమర్శ నుంచి ఎలాంటి సినిమాలైనా చేయగలడు అనే స్థాయికి చేరుకున్నాడు. అందులో భాగంగానే మరో అడుగు ముందుకేసి ఈ వైద్యభరితమైన సినిమా చేశాడు” అన్నారు.
భవ్య క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ చిత్రానికి చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వం వహించగా.. వి. ఆనంద్ ప్రసాద్ నిర్మాతగా వ్యవహరించారు. అందాల భామలు రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాశ్ వారియర్ హీరోయిన్లుగా నటించారు. కల్యాణి మాలిక్ సంగీతం అందించారు.