rishi ganga: రిషిగంగా వద్ద కొత్తగా సరస్సు.. పొంచి ఉన్న మరో ముప్పు: శాస్త్రవేత్తలు హెచ్చరిక – another lake formed upstream of rishiganga river, poses danger: experts

0
16


ప్రధానాంశాలు:

  • ఉత్తరాఖండ్‌ దుర్ఘటనలో కొనసాగుతున్న సహాయక చర్యలు.
  • మరోసారి రిషిగంగకు ఆకస్మిక వరదలు వచ్చే ప్రమాదం.
  • తపోవన్ సమీపంలో కొత్తగా ఏర్పడిన మరో సరస్సు.

దేవభూమిపై మరోసారి ప్రకృతి కన్నెర్ర జేసిన విషయం తెలిసిందే. ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లాలో మంచు చరియలు విరిగిపడి ధౌలిగంగా, రిషిగంగా నదులు ఉప్పొంగాయి. దీంతో రైనీ గ్రామం వద్ద ఉన్న చిన్నతరహా జల విద్యుత్ కేంద్రం కొట్టుకుపోగా.. మరొకటి పాక్షికంగా ధ్వంసమయ్యింది. ఈ ఘటనలో మొత్తం 204 మంది ఆచూకీ గల్లంతు కాగా.. వీరిలో 36 మృతదేహాలు లభ్యమయ్యాయి. జోషిమఠ్ వద్ద సొరంగంలో 34 మంది చిక్కుకుపోగా.. ఆరు రోజులుగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. వాతావరణం ప్రతికూలంగా మారడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది.

ఇదిలా ఉండగా, ఆ ప్రాంతానికి మరో ముప్పు పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రిషిగంగా నది ప్రాంతంలో హేమవతి నందన్ బహుగుణ గర్వాల్ యూనివర్సిటీ (హెచ్ఎన్‌బీజీయూ) జియాలిజస్ట్‌లు నిర్వహించిన సర్వేలో ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. రిషిగంగా సమీపంలో కొత్తగా ఓ సరస్సు ఏర్పడిందని, మరోసారి ఆకస్మిక వరదలకు అవకాశం ఉందని హెచ్చరించింది.

గత నాలుగు రోజుల నుంచి విపత్తు ప్రదేశానికి సమీపంలో ఒక చిన్న కాలువగా ప్రవహించే రిషిగంగా నదిలో క్రమంగా నీటి ప్రవాహం పెరుగుతుండటంతో సహాయక చర్యలను తాత్కాలికంగా నిలిపివేశారు. అంతేకాదు, పరీవాహక ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తం చేశారు. సర్వేకు సంబంధించి వీడియోను విడుదల చేసిన శాస్త్రవేత్తలు.. ముప్పు పొంచి ఉందని వివరించారు.

రిషిగంగా దగ్గరలో నీలి రంగు సరస్సు ఏర్పడిందని ఎర్త్ సైన్సెస్ విభాగానికి చెందిన ప్రొఫెసర్ నరేశ్ రానా తెలిపారు. ‘ఇక్కడ రౌంతి, రిషిగంగా ప్రవాహాలను స్పష్టంగా చూడగలిగే శిఖరం వద్ద ఉన్నాను. రౌంతి ప్రవాహం నుంచి ఆకస్మిక వరదలు వచ్చినట్లు తెలుస్తోంది. వరద తాత్కాలిక ఆనకట్టను సృష్టించింది.. ఈ ఆనకట్ట కారణంగా రిషిగంగా ప్రవాహానికి అవరోధం ఏర్పడింది… నీలిరంగు సరస్సు దూరంలో ఏర్పడటం కనిపిస్తోంది.. చాలా కాలం నుంచి ఉన్న ఈ సరస్సు స్థిరంగా ఉంది.. అందువల్ల, ఇది చాలా వరకు విస్తరించిందని భావించవచ్చు’ అని పేర్కొన్నారు.

‘సరస్సు ఏర్పడటం ఆలోచించాల్సిన విషయమే.. మరోసారి రిషిగంగా ఉప్పొంగి సహాయక చర్యలపై ప్రభావం చూపుతుంది.. దీని గురించి అధికార యంత్రాగానికి సమాచారం చేరవేసి, అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచిస్తాం.. సరస్సు ఏర్పడిన ప్రాంతానికి వెళ్లడానికి ప్రయత్నిస్తాం.. దాని పరిమాణంపై ఓ అవగాహన వస్తుంది’ అని వ్యాఖ్యానించారు.

రిషిగంగా పై భాగంలో సరస్సు ఏర్పడిన విషయాన్ని వాడియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ జియాలజీ (డబ్ల్యూఐహెచ్‌జీ) డైరెక్టర్ కాలాచంద్ సైనీ ధ్రువీకరించారు. తమ శాస్త్రవేత్తల బృందం ఏరియల్ సర్వేలో గుర్తించిందన్నారు. ‘సముద్ర మట్టానికి 5,600 మీటర్ల ఎత్తులో ఉన్న ప్రధాన శిఖరం నుంచి ఓ శిల విరిగిపడింది. దాని భాగంలో ఉన్న హిమానీనదం కూడా విరిగిపోయి నదిలో పడింది.. ఇది తాత్కాలిక ఆనకట్టను సృష్టించింది.. తరువాత విపత్తుగా మారింది’ అని సైనీ అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here