ఎర్రకోటలో మృతి చెందిన కాకి నమూనాలను భోపాల్ లాబొరేటరీకి పంపించి బర్డ్‌ఫ్లూ కారక H5N1 వైరస్ ఉన్నట్లు నిర్ధారించుకున్నామని ఢిల్లీ పశు సంరక్షణ విభాగం డైరెక్టర్ రాకేష్ సింగ్ తెలిపారు. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
‘ఏదైనా ప్రాంతంలో ఏవియన్ ఇన్‌ఫ్లూయెంజా ఉందని తేలితే.. యాక్షన్ ప్లాన్ ప్రకారం దాన్ని అలర్ట్ జోన్‌గా ప్రకటిస్తాం. వైరస్ వ్యాప్తి చెందకుండా చర్యలు చేపడతాం’ అని పశు సంరక్షణ విభాగం అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో జనవరి 26 వరకు ఎర్రకోట లోపలికి సందర్శకులను అనుమతించడం లేదని వివరించారు. జనవరి 26న ఎర్రకోటలో రిపబ్లిక్ డే వేడుకలు యథావిధిగా జరుగుతాయని తెలిపారు. తాత్కాలికంగా రిహార్సల్స్‌కు ఇబ్బంది ఏర్పడినట్లు చెప్పారు.
ఇప్పటికే దేశంలోని పలు రాష్ట్రాల్లో బర్డ్‌ఫ్లూ కేసులు వెలుగులోకి వచ్చాయి. పలు ప్రాంతాల్లో కాకులు, కోళ్లు, ఇతర పక్షులు వేల సంఖ్యలో మృత్యువాతపడ్డాయి. తాజాగా మంగళవారం పంజాబ్‌లోనూ బర్డ్‌ఫ్లూ కేసు నమోదైంది.
బర్డ్‌ఫ్లూ వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలు చేపట్టింది. ఢిల్లీ శివారు ప్రాంతాల నుంచి ప్యాకెజ్డ్, ప్రాసెస్డ్ చికెన్‌ను నగరంలోకి తరలించకుండా నిషేధం విధించింది. ఢిల్లీలో అతి పెద్దదైన గాజీపూర్ పౌల్ట్రీ మార్కెట్‌ను 10 రోజుల పాటు మూసివేస్తూ ఆదేశాలు జారీ చేశారు. శనివారం ఢిల్లీ జంతు ప్రదర్శనశాలలో చనిపోయిన ఓ గుడ్లగూబ మృతదేహం నమూనాలను పరీక్షించగా.. బర్డ్‌ఫ్లూ సోకినట్లు తేలింది.