ప్రధానాంశాలు:
- ’30 రోజుల్లో ప్రేమించటం ఎలా?’ థాంక్స్ మీట్
- భారీ కేక్ కట్ చేసి సక్సెస్ సెలబ్రేషన్స్
- ప్రతి ప్రేక్షకుడికి పాదాభివందనం అంటూ ప్రదీప్ స్పీచ్
ఫిబ్రవరి 4వ తేదీ హైదరాబాద్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో హీరో ప్రదీప్ మాచిరాజు, దర్శకుడు మున్నా, సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్, కెమెరామెన్ శివేంద్ర, నిర్మాత యస్వీ బాబు, నటులు శుభలేఖ సుధాకర్, భద్రం, నటి హేమ తదితరులు పాల్గొన్నారు. భారీ కేక్ కట్ చేసి సక్సెస్ సెలెబ్రేషన్స్‌ని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా హీరో ప్రదీప్ మాచిరాజు మాట్లాడుతూ ఈ సినిమా విజయంపై ఎమోషనల్ కామెంట్స్ చేశారు.
”ఇది మా అబ్బాయి సినిమా అంటూ కుటుంబ సమేతంగా థియేటర్స్‌కి వచ్చి ఈ సినిమాని చూస్తున్న ప్రతి ప్రేక్షకుడికి పాదాభివందనం చేస్తున్నా. రిలీజైన నాటి నుండి నేటి వరకు 25 థియేటర్స్ సందర్శించాం. ఆడియన్స్ రెస్పాన్స్ చూస్తుంటే ఎంతో ఆనందం కలుగుతోంది. సినిమా చాలా చాలా బాగుంది అని ప్రతీ ఒక్కరూ అభినందిస్తున్నారు. మేము ఊహించనంత హిట్ చేసిన అభిమానులకు, ప్రేక్షకులకు ధన్యవాదాలు. యస్వీ బాబు గారు సొంతకొడుకు సినిమాకి కేర్ తీసుకున్నంతగా నన్ను చూసుకొని హీరోగా మంచి సినిమా ద్వారా లాంచ్ చేశారు. ఆయనకి ఎప్పుడూ రుణపడి ఉంటాను.
అలాగే నాకు జీవితాంతం గుర్తుండిపోయే సినిమా ఇచ్చిన డైరెక్టర్ మున్నాకి చాలా థాంక్స్. ఒక అన్నలా భావించి నాతో ఈ సినిమా చేశాడు మున్నా. ఈ సినిమాకి నేను హీరో కాదు. కథే హీరో. మెయిన్ లీడ్ పాత్ర చేసానంతే. మా అందరికీ ఇది ఒక డ్రీమ్ ప్రాజెక్ట్. అలాగే లైఫ్ లాంగ్ గుర్తుండి పోయే పాటలు ఇచ్చిన అనూప్‌కి థాంక్స్. నా మొదటి సినిమా జర్నీలో టీం అందరూ చాలా కష్టపడి చేశారు. ఆరంభంలోనే నాకు ఒక సక్సెస్ఫుల్ సినిమా ఇచ్చారు. ముఖ్యంగా మా ఆర్ట్ డైరెక్టర్ నరేష్ షూటింగ్ టైంలో అనుకోకుండా మా అందరికీ దూరమయ్యారు. ఆయన లేనిలోటు మాకు చాలా వెలిథిగా ఉంది. నా క్యారెక్టర్ని స్కెచెస్ వేసి అద్భుతంగా డిజైన్ చేశారు. ఆయన కుటుంబానికి మేమంతా జీవితాంతం తోడుంటామని ప్రామిస్ చేస్తున్నాం. ఇక నేను చేసే ప్రతీ సినిమా మొదటి సినిమాలా భావించి కష్టపడి చేస్తానని మాటిస్తున్నాను” అన్నారు ప్రదీప్.