ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రాంపూర్ గ్రామానికి చెందిన రూప్ రామ్ (103)కు అయినవాళ్లెవరూ లేరు. కొన్నేళ్లుగా గ్రామంలో ఒంటరిగా జీవనం గడుపుతున్నాడు. రూప్ రామ్‌కు ఇద్దరు బిడ్డలు ఉన్నారు. కానీ, తల్లి చనిపోవడంతో ఏళ్ల కిందటే వాళ్లిద్దరూ తమ బతుకు తాము చూసుకున్నారు. ఇప్పుడు వాళ్లిద్దరూ ఎక్కడున్నారో ఆయనకు తెలియదు. ఇంతవరకు ఒక్కసారి కూడా వాళ్లు తనను చూడటానికి రాలేదని అతడు కంటతడి పెట్టుకున్నాడు.
ఒకవేళ తాను మరణిస్తే.. అందరిలాగే సంప్రదాయం ప్రకారం తనకు అంత్యక్రియలను నిర్వహించేవారు ఎవరూ లేరనే విషయం రూప్ రామ్‌ను బాధిస్తోంది. తన ఆవేదనను పలువురు గ్రామస్థులతో పంచుకున్నాడు. ఆ గ్రామ పూజారి ఓ సూచన చేశాడు. అది మన రూప రాముడికి బాగా నచ్చింది.
మనిషి మరణిస్తే అతడి కొడుకులు, ముఖ్యంగా పెద్ద కుమారుడు అంతిమ సంస్కారాలు నిర్వహిస్తాడు. అలా చేస్తే.. తండ్రిని పున్నామ నరకం నుంచి తప్పించవచ్చని విశ్వాసం. మరి అంత్యక్రియలు చేయడానికి ఎవరూ లేకపోతే.. నరకానికి పోవాల్సిందేనా.. వేరే దారి లేదా..? అనడిగితే రాంపూర్ గ్రామ పూజారి మోహన్ పాండే ఓ పరిష్కారం చెప్పారు. పున్నామ నరకం నుంచి తప్పించుకునేందుకు ఎవరైనా తమకు తామే అంత్యక్రియలు చేసుకునే అవకాశం ఉందని వివరించారు.
‘మోక్షం కోసం కొంత మంది బతికుండగానే అంత్యక్రియలు చేసుకుంటారు. అలా చేసుకోవడం వారికి శాంతిని, ఎంతో సంతృప్తిని ప్రసాదిస్తుంది. జీవితంలో చేసిన పాపాల నుంచి ముక్తిని కూడా కలిగిస్తుంది. ఓ వ్యక్తి చనిపోయిన తర్వాత మోక్షం పొందడానికి తన వాళ్లు ఏం చేస్తారో అతడికి ఎలాగూ తెలియదు. బతికుండగానే అంత్యక్రియలు చేసుకుంటే.. దాన్ని ప్రత్యక్షంగా అనుభవించవచ్చు’ అని పూజారి మోహన్ పాండే చెప్పారు. మహాభారతంలో భీముడు మోక్షం కోసం బతికుండగానే పిండ ప్రదానం చేసుకున్నాడని వివరించారు.
పూజారి మాటలు విన్న తర్వాత రూప్ రామ్ తన అంత్యక్రియలు తానే నిర్వహించుకోవాలని నిర్ణయించకున్నాడు. ఆ విషయాన్ని గ్రామ పంచాయతీ పెద్దలకు, తోటి గ్రామస్థులకు తెలియజేశాడు. రూ. 6 వేలు ఇస్తే అన్ని ఏర్పాట్లను తామే చేస్తామని గ్రామ పంచాయతీ ముందుకొచ్చింది. గ్రామస్థులు కూడా సహకరించారు. బ్యాండ్ మేళం కూడా వచ్చింది. ఇంకేం.. రూప్ రామ్ తన అంత్యక్రియలను ఘనంగా నిర్వహించుకున్నాడు.