చదువు పట్ల ఆసక్తి ఉంటే చాలు వయసుతో సంబంధం లేదని నిరూపిస్తున్నారు ఒడిశాకు చెందిన జై కిశోర్ ప్రధాన్. బ్యాంకు ఉద్యోగిగా పని చేసి రిటైరయిన ఆయన.. 64 ఏళ్ల వయసులో నీట్లో అర్హత సాధించి ఎంబీబీఎస్ మొదటి సంవత్సరంలో చేరుతున్నారు. 60 ఏళ్లు పైబడిన వ్యక్తి మెడిసిన్ చదువుతుండటం.. భారత వైద్య విద్య చరిత్రలోనే అరుదైన అంశం కావడం విశేషం.
సెప్టెంబర్‌లో నీట్ రాసిన ప్రధాన్.. మంచి ర్యాంక్ సాధించి వీఐఎంఎస్ఆర్లో సీటు సాధించారు. తన ఇద్దరు కవల కూతుళ్లలో ఒకరు ఇటీవలే చనిపోవడంతో.. నీట్ రాసి ఎంబీబీఎస్‌లో చేరి డాక్టర్ కావాలని ప్రధాన్ నిర్ణయించుకున్నారు. ఎంబీబీఎస్ పూర్తి చేసే సమయానికి ఆయన వయసు 70 ఏళ్లకు చేరువ అవుతుంది. ఎంబీబీఎస్ చదివి వైద్యంతో డబ్బులు సంపాదించాలనే ఉద్దేశం నాకు లేదు. జీవించి ఉన్నంత కాలం ప్రజలకు వైద్యసేవలు అందిస్తానని ఆయన చెప్పారు.