ప్రధానాంశాలు:
- దక్షిణాఫ్రికా స్ట్రెయిన్‌పై సమర్ధంగా పనిచేస్తోన్న నోవావ్యాక్స్.
- క్లినికల్ ట్రయల్స్ 90 శాతం ప్రభావం చూపిన బ్రిటన్ టీకా.
- అత్యవసర వినియోగానికి అమెరికా ఎఫ్‌డీఏతో సంప్రదింపులు.
టీకా ఆమోదం విషయంలో అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అధికారులతో నోవావ్యాక్స్ చర్చించింది. అత్యవసర వినియోగం కింద ఆమోదానికి యూకే, దక్షిణాఫ్రికాలో నిర్వహించిన క్లినికల్ ట్రయల్స్ డేటా సరిపోతుందని భావిస్తున్నారు. ఇప్పటికే ఫైజర్, మోడెర్నా టీకాలు 95 శాతం ప్రభావవంతంగా పనిచేస్తున్నట్టు ప్రకటించాయి.
నోవావ్యాక్స్ ఫలితాలు కూడా ఫైజర్, మోడెర్నాకు సమానంగా ఉన్నాయని న్యూయార్క్‌లోని వెయిల్ కార్నేల్ మెడికల్ కాలేజీ మైక్రోబయలాజీ అండ్ ఇమ్యునాలజీ ప్రొఫెసర్ జాన్ మూరే అన్నారు. ‘ఇది గణాంకాల పరంగా భిన్నంగా లేదు.. టీకా ప్రాథమికంగా బ్రిటన్‌లో విజృంభిస్తోన్న వేరియంట్‌పై సమర్ధవంతంగా పనిచేస్తుంది.. అంటే ఇది అమెరికాలోనూ సమానంగా ప్రభావవంతంగా ఉంటుంది’ అన్నారు.
దక్షిణాఫ్రికాలో కరోనా టీకా ప్రయోగాలు కొనసాగుతుండగా.. కొత్తరకం స్ట్రెయిన్‌ను గుర్తించడంతో కొంత ఇబ్బందిగా మారింది. అయితే, హెచ్ఐవీ లేని వ్యక్తుల్లో నొవావ్యాక్స్ టీకా 60 శాతం సమర్ధవంతంగా పనిచేస్తున్నట్టు ఫలితాల్లో వెల్లడయ్యింది. నొవావ్యాక్స్ టీకా ఉత్పత్తి ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆరు ప్రాంతాల్లో జరుగుతుండగా.. దీనిని ఎనిమిదికి పెంచనున్నారు. ఏడాదికి 2 బిలియన్ డోస్‌లు లక్ష్యంగా పెట్టుకున్నట్టు నొవావ్యాక్స్ తెలిపింది. తాజాగా ప్రకటించినవి క్లినికల్ ట్రయల్స్ మధ్యంతర ఫలితాల తాత్కాలిక డేటా అని ఆ సంస్థ పేర్కొంది. రెగ్యులేటరీ ఆమోదానికి రెండు మూడు నెలల ముందే దరఖాస్తు చేయాలని భావిస్తున్నామని తెలిపింది.