ప్రధానాంశాలు:
- పవన్ కళ్యాణ్- క్రిష్ కాంబోలో మూవీ
- హీరోయిన్గా నిధి అగర్వాల్
- మెగా అభిమానులను ఫిదా చేసేలా ఇస్మార్ట్ బ్యూటీ కామెంట్స్
రీ- ఎంట్రీ తర్వాత వరుస సినిమాలతో బిజీ అయిన పవన్ కళ్యాణ్ ఇటీవలే తన ‘వకీల్ సాబ్’ సినిమా షూటింగ్ ఫినిష్ చేసి ప్రస్తుతం తన తదుపరి సినిమాలపై ఫోకస్ పెట్టారు. అందులో ఒకటే క్రిష్ దర్శకత్వంలో రాబోతున్న సినిమా. పవర్ఫుల్ యాక్షన్ ఓరియెంటెడ్ మూవీగా ఈ సినిమా రూపొందుతోంది. ఎ.ఎం.రత్నం నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇందులో పవన్ సరసన ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్, బాలీవుడ్ బ్యూటీ జాక్వలైన్ ఫెర్నాండెజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారని తెలిసింది. కాకపోతే హీరోయిన్లు ఎవరనే దానిపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు.
ఈ నేపథ్యంలో తాజాగా ఈ విషయమై రియాక్ట్ అయిన నిధి అగర్వాల్.. అవును, నేను పవన్ కళ్యాణ్‌తో కలిసి నటిస్తున్నానని క్లారిటీ ఇచ్చేసింది. ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో #PSPK27 గురించి స్పందిస్తూ మెగా అభిమానులను ఫిదా చేసే మాటలు మాట్లాడింది. ఇలాంటి పవర్ఫుల్ ప్రాజెక్ట్‌లో పవర్‌స్టార్‌తో తెరపంచుకోనుండటం ఎంతో ఆనందంగా ఉందని, తన కల నెరవేరినట్లుగా ఉందని తెలుపుతూ ఫీలింగ్స్ బయటపెట్టేసింది. నటిగా ఇది తనకు తొమ్మిదో చిత్రమని, దీన్ని గోల్డెన్ ఫిల్మ్‌గా భావిస్తున్నానని చెప్పింది.
ఇకపోతే ఇప్పటికే తాను ఈ సినిమా షూట్లో జాయిన్ అయినట్లు పేర్కొన్న నిధి అగర్వాల్.. పవన్ కళ్యాణ్ అద్భుతమైన, ఉన్నతమైన వ్యక్తి అంటూ ఆయనపై పొగడ్తల వర్షం గుప్పించింది. మొదట ఈ చిత్రానికి ‘విరూపాక్ష’ అనే టైటిల్ కన్ఫర్మ్ చేశారని వార్తలు రాగా, తాజాగా ఆ టైటిల్ కాదని ‘హరిహర వీరమల్లు’ అనే టైటిల్ ఫైనల్ చేశారని తెలుస్తోంది.