Mumbai Old Man: ఆమె కోసం ఇళ్లు కూడా అమ్మి ఆటోలోనే అన్నీ.. తాతయ్య చిరునవ్వు వెనుక కొండంత కష్టం – mumbai old man sold his house for grand daughter teacher dream, sleeps in his auto, story is viral

0
19


బోసినవ్వులు చిందిస్తున్న ఈ తాత పేరు దేశ్‌రాజ్‌. ఆ నవ్వు అంత ఈజీగా వచ్చింది కాదు. దాని వెనుక భరించలేనన్ని బాధలు, మోయలేనన్ని బరువు, బాధ్యతలు ఉన్నాయి. విశ్రాంతి తీసుకోవాల్సిన వయసులో ఈ తాత రెక్కలు ముక్కలు చేసుకుంటున్నాడు. ఇద్దరు కుమారులను పోగొట్టుకున్నాడు. భార్య, కోడళ్లు, మనవలు, మనవరాళ్లను పోషించడానికి రేయింబవళ్లు కష్టపడుతున్నాడు. అంతటి కష్టంలోనూ మనవరాలు ఓ పెద్ద కోరిక కోరింది. అది తీర్చడానికి ఇళ్లు అమ్మేశాడు. ఏడాది కాలంగా ఆటోనే తన ఇళ్లుగా మార్చుకున్నాడు. ఆనందంగా..!

కుటుంబసభ్యులను ఊర్లో బంధువుల ఇంటికి పంపించాడు. వాళ్ల కోసం మరింత ఎక్కువగా కష్టపడుతున్నాడు. తన మనవరాలు అనుకున్నది సాధిస్తే ఈ బాధలన్నీ మర్చిపోతానంటున్నాడు. ఆ పెద్దాయనకు అన్ని కష్టాలు ఎందుకొచ్చాయి? కొడుకులకు ఏమైంది? హృదయాలను మెలిపెడుతున్న ఓ తాతయ్య కథ..

దేశ్‌రాజ్ పెద్ద కొడుకు (40) ఆరేళ్ల కిందట ఒక రోజు ఎప్పటిలాగే పనికి వెళ్లాడు. కానీ, తిరిగి రాలేదు. వారం రోజుల తర్వాత అతడి మృతదేహం లభ్యమైంది. అలాంటి దు:ఖ సమయంలో దేశ్‌రాజ్‌కు ఏడుస్తూ కూర్చునేంత సమయం కూడా లేదు. కుటుంబ బాధ్యతలు గుర్తొచ్చాయి. రెండో రోజే ఆటో స్టీరింగ్ పట్టుకున్నాడు. అర్ధరాత్రి వరకూ ఆటో నడుపుతూ.. కుటుంబసభ్యులకు ఏ లోటు రాకుండా చూసుకున్నాడు.

రెండేళ్ల తర్వాత మరో విషాదం. ఒక రోజు ఆటో నడుపుతుండగా దేశ్‌రాజ్‌కు ఓ ఫోన్ కాల్ వచ్చింది. ‘మీ రెండో కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు’ అని దాని సారాంశం. ఏడ్చేంత సమయమూ లేదు, ఒంట్లో ఓపికా లేదు. ఏం చేయాలో అర్థం కాలేదు.

ఇద్దరు కొడుకులు పోయారు. భార్య, ఇద్దరు కోడళ్లు, వాళ్ల నలుగురు పిల్లలు.. వీళ్లందరి పరిస్థితి ఏంటి? వాళ్ల బాధ్యతలు ఎవరు చూసుకుంటారు? మరో మార్గమే లేదు. అన్నీ తానే. ఈసారి మరింత బలంగా నిర్ణయించుకున్నాడు. తాను ఉన్నంతకాలం వాళ్లకు ఏ లోటూ రాకూడదు..!

చిన్న కొడుకు పోయాక, దేశ్‌రాజ్ మనవరాలు అయన దగ్గరికి వచ్చి.. ‘తాతా నేను చదువు మానేయ్యాలా?’ అని అడిగింది. ఆయన గుండె పగిలినంత పనైంది. ఏం సమాధానం చెప్పాలో తెలియలేదు. కానీ, ధైర్యం కూడగట్టుకున్నాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ చదువును వదలొద్దమ్మా అని మనవరాలికి చెప్పాడు. తొమ్మిదో తరగతి చదువుతున్న ఆ పాప మదిలో ఆ మాట బలంగా నాటుకుపోయింది. ఇక అక్కడ నుంచి ఆ చిన్నారి వెనక్కి తిరిగి చూడలేదు.

పిల్లలు పెరుగుతున్నకొద్దీ ఖర్చులు పెరిగాయి. దేశ్‌రాజ్ వయసు కూడా పెరుగుతోంది. కానీ, కుటుంబం కోసం ఆయన ఎక్కువ సమయం పనిచేయడం మొదలుపెట్టాడు. ఉదయం 6 గంటలకు వెళ్తే.. ఏ అర్ధరాత్రికో పని ముగించేది. అలా కష్టపడితే నెలకు రూ.10,000 వచ్చేవి. అందులో రూ.6000 పిల్లల స్కూల్‌ ఫీజులకు, ఇతర ఖర్చులకు పోతే, మిగతా నాలుగు వేల రూపాయలతోనే నెలంతా తినాలి. చాలా సార్లు ఒక్క పూట తినడానికి కూడా ఉండేది కాదు. భరించలేని కష్టం.

అంత బాధలోనూ దేశ్‌రాజ్‌కు ఆనందం కలిగించిన విషయాలు ఉన్నాయి. తన మనవరాలు 12వ తరగతిలో 80 శాతం మార్కులతో పాసైంది. ‘ఆ రోజు నా ఆటోలో ప్రయాణికులను ఉచితంగా ఎక్కించుకున్నా..’ అంటూ దేశ్‌రాజ్ సంతోషంగా చెప్పాడు. ఆ మాట చెబుతున్నప్పుడు ఆయన మోముపై అదే చెరగని చిరునవ్వు.

తాను చెప్పిన మాట ప్రకారం చదువులో రాణిస్తున్న మనవరాలు పెద్ద కోరికే కోరింది. టీచర్‌ కావాలి.. బీఈడీ కోర్సు కోసం ఢిల్లీ వెళ్లాలి. తాతకు అంత స్తోమత లేదు. కానీ, మనవరాలిని ఎలాగైనా టీచర్‌గా చూడాలనుకున్నాడు. వాళ్లు ఉంటున్న ఇంటిని అమ్మేసి, ఫీజు కట్టేశాడు. ఎప్పటిలాగే ఆయన మోముపై చిరునవ్వు చెక్కుచెదరలేదు.

ఆ తర్వాత దేశ్‌రాజ్ తన భార్య, కోడళ్లు, మిగతా మనవళ్లను తన ఊరిలోని బంధువుల ఇంటికి పంపేశాడు. తాను మాత్రం ముంబైలోనే ఉంటున్నాడు. ఇప్పుడు ఉండటానికి ఇల్లు లేదు. ఆటోలోనే తినడం.. ఆటోలోనే పడుకోవడం. ఏడాదిగా దేశ్‌రాజ్ దినచర్య ఇదే. ఢిల్లీలో చదువుతున్న మనవరాలు ఈ మధ్యే ఫోన్‌ చేసి ‘తాతయ్యా.. నేను క్లాస్‌లో ఫస్ట్‌ వచ్చా’ అని చెప్పింది. ఆ మాట వినగానే తాతయ్య కష్టాలన్నీ ఎగిరిపోయాయి.

‘నా మనవరాలు ఎప్పుడెప్పుడు టీచర్‌ అవుతుందా అని ఎదురుచూస్తున్నా. ఆ రోజు నేను తనను హత్తుకుని మమ్మల్ని గర్వపడేలా చేశావమ్మా.. అని చెప్పాలి. ఎందుకంటే మా కుటుంబంలో ఉన్నత చదువులు చదివిన తొలి వ్యక్తి ఆమే..’ అని దేశ్‌రాజ్ చెప్పాడు. ఆ రోజు కూడా తన ఆటోలో ప్రయాణికులను ఉచితంగానే తిప్పుతాడట.

తాతయ్య కష్టం చదువుతుంటే గొంతు ఎండిపోయింది.. ‘హ్యూమన్స్‌ ఆఫ్‌ బాంబే’ చేసిన ఈ పోస్ట్ చదివిన తర్వాత ఓ నెటిజన్ రియాక్షన్ ఇది. ముంబై నగరవాసుల జీవితానికి సంబంధించిన గొప్ప గొప్ప స్టోరీలు పోస్టు చేస్తూ ఈ సోషల్‌ మీడియా పేజీ ఇప్పటికే ఎనలేని ఖ్యాతి పొందింది. ఇప్పుడు ఈ తాత కథ చదువుతుంటే నెటిజన్ల హృదయం కరిగిపోతోంది.

‘ఆ తాతకు నేను తోచినంత ఆర్థిక సాయం చేస్తా..’ అంటూ ఓ ఫేస్‌బుక్‌ యూజర్‌ కామెంట్ పెట్టాడు. ఇంకో యూజర్ మరో అడుగు ముందుకేశాడు. తాత కోసం ఫండ్‌ రైజింగ్ మొదలుపెట్టాడు. ఇప్పటికే రూ.5.3 లక్షల విరాళాలు పోగయ్యాయి.

మహారాష్ట్ర కాంగ్రెస్‌ నేత అర్చనా దాల్మియా.. దేశ్‌రాజ్‌ గురించి తన ట్విటర్‌ ఖాతాలో ఓ పోస్టు చేశారు. ఆ తాత ఫోన్ నంబర్ కూడా షేర్ చేశారు. తాతకు సాయం చేయాలంటూ ముంబై వాసులను కోరారు. అది కూడా వైరల్ అవుతోంది. ఇప్పుడు చాలా మంది యూజర్లకు మనసు కాస్త ప్రశాంతంగా ఉంది. అదే సమయంలో కాస్త ఉత్కంఠగానూ ఉంది. ఆ తాత తన మనవరాలిని టీచర్‌గా చూడాలి..!

Also Read:

ఆటో డ్రైవర్‌ నిజాయితీ.. 20 లక్షల నగలు తిరిగిచ్చేశాడు

నా అనేవాళ్లు లేరు.. బతికుండగానే అంత్యక్రియలు చేసుకున్నాడు

అమ్మాయిల కోసం వీళ్ల బ్యాగులో ఏముంటాయో తెలుసా.. కదిలించే కుర్రోళ్లు

3 రోజులుగా టన్నెల్ ముందే శునకం.. తనవాళ్లు వస్తారా? ఉత్తరాఖండ్‌ కన్నీటి దృశ్యం!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here