Mumbai local train: 11 నెలల తర్వాత తిరిగొచ్చిన ‘బతుకుబండి’.. మోకరిల్లి దండం, ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్న ఫొటో – a photo of man bowing before mumbai local train shakes internet

0
55


భారతీయ రైళ్లను బతుకుబండ్లుగా పేర్కొంటారు. ఇతర ప్రయాణ సాధనాలతో పోలిస్తే చాలా తక్కువ సొమ్ములతోనే గమ్యం చేర్చడం అందుక్కారణం. రైలు బండి కాదది, ఒక్కమాటలో చెప్పాలంటే.. పేదవాడి బతుకుచిత్రం. రైలంటే చాలా మందికి జీవనగమనం. లోకల్ రైళ్ల రాక ఈ బతుకుచిత్రాన్ని మరింత మార్చింది. నగరాల్లో పేదలు, మధ్య తరగతి వాళ్ల జీవితాలతో ఈ ‘లోకల్ రైలు’ తన బంధం పెనవేసుకుంది.

కానీ, ఏడాది కిందట ఎవరూ ఊహించని విధంగా కరోనా మహమ్మారి పంజా విసిరింది. మనిషి జీవితాన్ని అతలాకుతలం చేసింది. లాక్‌డౌన్‌తో ప్రజా రవాణా మూగబోయింది. లోకల్ రైళ్లు నిలిచిపోవడంతో సామాన్యుడి జీవనగమనం ఆగిపోయింది. కాళ్లు, చేతులు విరిచేసి చీకటి గదిలో పడేసినంత పనైంది. పేదవాడి గుండె బరువెక్కింది.

రోజులు, వారాలు, నెలలు గడిచాయి. ఆ నిరీక్షణ కొనసాగుతూనే ఉంది. చివరికి 11 నెలల తర్వాత ఆ బతుకుబండి తిరిగి పట్టాలెక్కింది. ఆ బండిని చూడగానే గుండె ఉప్పొంగింది. భక్తిభావంతో రెండు చేతులూ దగ్గరికి వచ్చాయి. తిరిగొచ్చిన ఆ జీవనాధారం ముందు ఇలా మోకరిల్లాయి. ముంబైలోని ఛత్రపతి శివాజీ టెర్మినస్‌‌‌లో తీసిన చిత్రమిది. ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది.

దేశ ఆర్థిక రాజ‌ధాని ముంబైకి ఆయువుపట్టు లాంటి లోకల్ రైళ్లు రోజూ ల‌క్షలాది మందిని గమ్యస్థానాలకు చేరుస్తున్నాయి. క‌రోనా కార‌ణంగా గ‌తేడాది మార్చిలో ఆగిపోయిన ఆ రైళ్లు ఫిబ్రవరి 1 నుంచి మ‌ళ్లీ సాధార‌ణ ప్రజ‌ల‌కు అందుబాటులోకి వ‌చ్చాయి. సుదీర్ఘ కాలం తర్వాత తొలిసారిగా సబర్బన్ రైలు ఎక్కుతూ ఓ ప్రయాణికుడి పొందిన తన్మయత్వానికి సజీవ సాక్ష్యం ఈ చిత్రం. లోక‌ల్ రైలుకు ముంబై ప్రజలు త‌మ జీవితాల్లో ఎంతటి ప్రాధాన్యం ఇస్తారో కళ్లకు కట్టే ఫొటో.

ఈ ఫొటోను చూసి సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ స్పందిస్తున్నారు. ‘లోక‌ల్ రైలు అనేది కేవ‌లం ఒక ప్రయాణ సాధ‌నం కాదు.. ఓ భావోద్వేగం’ అంటూ కామెంట్ చేస్తున్నారు. ‘లైఫ్ లైన్ ఆఫ్ ది సిటీ’ అంటూ మరి కొంత మంది నెటిజన్లు కామెంట్లు చేశారు.

సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా తనదైన శైలిలో స్పందించారు. ‘ఇది భారతదేశ ఆత్మ. దీన్ని ఇక ఎప్పుడూ కోల్పోవద్దని ప్రార్థిస్తున్నా..’ అని ట్వీట్ చేశారు.

ఆ ఫొటోగ్రాఫర్‌కు నెటిజన్ల సెల్యూట్
బెంగళూరు డివిజనల్ రైల్వే మేనేజర్ అశోక్ కుమార్ వర్మ.. ఈ ఫొటోను ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్‌లో తీసినదిగా ధ్రువీకరించారు. శివసేన అధికారిక పత్రిక సామ్నా (Saamana) ఫొటోగ్రాఫర్ ఈ ద శ్యాన్ని తన కెమెరాలో బంధించినట్లు తెలుస్తోంది. ఆ ఫొటోగ్రాఫర్‌ పైనా నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here