ప్రధానాంశాలు:
- పుష్ప శ్రీవాణి, పరీక్షిత్ దంపతులకు రోజా శుభాకాంక్షలు
- డిప్యూటీ సీఎం పాపను ఆశీర్వదించిన రోజా
- పైడితల్లి అమ్మవారికి రోజా ప్రత్యేక పూజలు
పుష్ప శ్రీవాణి ఇంటికెళ్లిన రోజా.. దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. ఊయలలో ఉన్న పాపకు బొట్టుపెట్టి ఆశీర్వదించారు. తన చేతుల్లోకి తీసుకుని కాసేపు ఆడించారు. పుష్ప శ్రీవాణితో కాసేపు మాట్లాడారు. ఆమెను ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. అక్కడి నుంచి విజయనగరంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన పైడితల్లి అమ్మవారి దేవాలయానికి వెళ్లారు. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడారు.
డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి ఇంటికి రోజా.. చిన్నారికి ఆశీర్వాదం
రోజా మీడియాతో మాట్లాడుతూ విశాఖపట్నం ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రజా సంఘాలకు, వివిధ రాజకీయ పార్టీలు చేపడుతున్న ఉద్యమానికి వైఎస్సార్సీపీ ప్రత్యక్ష మద్దతు ఇస్తుందని రోజా స్పష్టం చేశారు. అవసరమైతే శాసనసభలో తీర్మానం చేస్తామని అన్నారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి స్టీల్ ప్లాంట్‌కు అన్యాయం చేస్తున్నారని, దీన్ని ఎవరికో అమ్ముతున్నట్లు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు అనడం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు.
‘‘అశోక్ గజపతిరాజు కేంద్రమంత్రిగా ఉన్నప్పుడే ప్రైవేటీకరణకు అడుగులు వేశారనడం నిజం కాదా? ఈ ప్లాంట్ అప్పుల పాలు కాకుండా చంద్రబాబు ఎందుకు చూడలేకపోయారు. స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేయకుండా ఆపాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రధానికి లేఖ రాశారు. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీఐఐసీ భూములు పరిశ్రమలకు ఇచ్చిన వాటిలో ఎక్కడా నిరుపయోగంగా లేవు. అటువంటి పరిస్థితే ఉంటే వాటిని వెనక్కి తీసుకుంటాం’’ అని రోజా వెల్లడించారు.