ప్రధానాంశాలు:
- గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన ‘క్రాక్’
- ఆర్థిక సమస్యలతో తొలి రోజు ఆసల్యంగా విడుదలైన సినిమా
- హిట్ టాక్తో మంచి వసూళ్లు రాబట్టిన రవితేజ చిత్రం
నిర్మాత బి.మధు తనకు ఇంకా రూ.12 లక్షల పారితోషికం బాకీ పడ్డారని, ఆ డబ్బు ఆయన ఇవ్వనంటున్నారని, ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతూ డైరెక్టర్స్ అసోసియేషన్లో గోపీచంద్ మలినేని ఫిర్యాదు చేశారు. గోపీచంద్ ఫిర్యాదును స్వీకరించిన డైరెక్టర్స్ అసోసియేషన్.. వివాదాన్ని నిర్మాతల మండలి వద్దకు తీసుకెళ్లింది. దీంతో ఈ విషయంపై వివరణ ఇవ్వాలని నిర్మాత బి.మధును నిర్మాతల మండలి సెక్రటరీ ప్రసన్న కుమార్ కోరారు. ఈ వివాదాన్ని సున్నితంగా పరిష్కరించేందుకు కేఎల్ నారాయణ ఆధ్వర్యంలో ఒక కమిటీని కూడా వేశారు.
అయితే, ఈ వివాదంపై తాజాగా ‘క్రాక్’ నిర్మాత బి.మధు స్పందించారు. కమ్యూనికేషన్ లోపం వల్లే ఈ విషయం బయటికి వచ్చిందని ఆయన అన్నారు. ‘క్రాక్’ సినిమా నిర్మించడానికి తాను చాలా ఇబ్బందులు పడ్డానని బి.మధు వెల్లడించారు. కొవిడ్-19 మహమ్మారి కారణంగా సినిమా ఆలస్యం కావడంతో బడ్జెట్ అమాంతం పెరిగిపోయిందని చెప్పారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు నియమించిన కమిటీకి తాను పూర్తిగా సహకరిస్తానని, వారికి పూర్తి వివరాలు వెల్లడిస్తానని తెలిపారు.
కమిటీపై తనకు పూర్తి విశ్వాసం ఉందని.. తనకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నానని మధు వెల్లడించారు. ఈ వివాదం గురించి ఇంతకు మించి మాట్లాడలేనని చెప్పిన నిర్మాత మధు.. సమయం వచ్చినప్పుడు పూర్తిగా వివరిస్తానని అన్నారు. ‘క్రాక్’ సినిమా రిలీజ్ విషయంలో ఎంత హైడ్రామా జరిగిందో తెలిసిందే. ఫైనాన్షియర్లకు మధు సకాలంలో డబ్బు తిరిగి చెల్లించకపోవడంతో జనవరి 9న సినిమా విడుదల అనుమానంగా మారింది. మొత్తానికి సాయంత్రానికి ఆర్థిక సమస్యలను పరిష్కరించి సెకండ్ షో నుంచి ప్రదర్శన ప్రారంభించారు. ఈ సినిమా హిట్ కావడంతో బి.మధు ఊపిరి పీల్చుకున్నారు.