ప్రధానాంశాలు:
- గల్వాన్ ఘర్షణల్లో చైనా జవాన్లు ఎంతమంది మరణించారు?
- దీనిపై ఇప్పటికే పలు అంతర్జాతీయ కథనాలు.
- తాజాగా కీలక వివరాలు వెల్లడించిన రష్యా అధికారిక న్యూస్ ఏజెన్సీ.
గల్వాన్ ఘర్షణల్లో చైనా జవాన్ల మృతి అంశంపై అప్పట్లో అమెరికా ఇంటిలిజెన్స్ వర్గాలు వెలువరించిన నివేదికలు, కొన్ని అంతర్జాతీయ వార్తా కథనాలను టాస్ తన కథనంలో ప్రస్తావించింది. లడఖ్ సరిహద్దులో భారత్-చైనా మధ్య 9 నెలలుగా సాగుతున్న ప్రతిష్టంభనకు తెరదించుతూ ఇరు దేశాల బలగాలను ఉపసంహరణ ప్రక్రియ మొదలైన వేళ రష్యా వార్తా సంస్థ ఈ కథనాన్ని ప్రచురించింది.
గల్వాన్ ఘర్షణల్లో కల్నల్ సంతోశ్ బాబు సహా 20 మంది భారత జవాన్లు అమరులయ్యారు. యావత్ భారతావని వీరికి ఘనంగా నివాళి అర్పించింది. వేలాది మంది అశ్రు నయనాల మధ్య ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి. శత్రువు మారణాయుధాలతో తెగబడినా.. ఖాళీ చేతులతోనే ప్రాణాలకు తెగించి పోరాడిన అమరవీరులకు భారత ప్రభుత్వం అత్యున్నత పురస్కారాలను ప్రకటించింది.

చైనాలోని పీఎల్ఏ ప్రభుత్వం మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధంగా వ్యవహరించింది. భారత సైన్యం చేతిలో తమ జవాన్లు మరణించిన విషయాన్ని అవమానంగా భావించింది. ఈ కారణంతో జవాన్ల మరణాల గురించి పైకి చెప్పలేదు. దేశం కోసం ప్రాణాలర్పించిన సైనికులకు చివరికి సరైన గౌరవం కూడా దక్కలేదు. ఆ జవాన్లకు గోప్యంగా అంత్యక్రియలు నిర్వహించాలని, వారి పేరుతో శిలాఫలకాలు ఏర్పాటు చేయొద్దని కుటుంబసభ్యులను ఆదేశించినట్లు అప్పట్లో అంతర్జాతీయ కథనాల్లో పేర్కొన్నారు. భారత్లో అమర జవాన్లకు అందిన గౌరవాన్ని సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న కొంత మంది చైనీయులు తమ ప్రభుత్వ తీరు పట్ల అసహనం వ్యక్తం చేసినట్లు కొన్ని పత్రికలు రాశాయి.