రైతు నవ్రీత్ సింగ్ ప్రాణ త్యాగం వృథా కాబోదని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అన్నారు. మోదీ సర్కార్ తీరుపై విరుచుకుపడ్డారు. రైతులను ఉగ్రవాదులుగా అభివర్ణించడం ఆమోదయోగ్యం కాదని పేర్కొన్నారు. యావత్ దేశం రైతుల వెంటే ఉందన్నారు. గురువారం (ఫిబ్రవరి 4) ఆమె యూపీలోని రాంపూర్ పరిధిలోని దిబ్డిబా గ్రామంలో పర్యటించారు. రిపబ్లిక్ డే దినోత్సవం రోజున ట్రాక్టర్ల ర్యాలీ సందర్భంగా మృతి చెందిన రైతు నవ్రీత్ సింగ్ కుటుంబాన్ని పరామర్శించారు.
రాంపూర్‌లోని విలాస్పూర్ పరిధిలోని దిబ్డిబా గ్రామంలో రైతు నవ్రీత్ సింగ్ అంత్యక్రియలు జరిగాయి. గురువారం ఆయన కుటుంబసభ్యులను ప్రియాంక గాంధీ కలిశారు. అనంతరం అక్కడ జరిగిన ప్రార్థన (అంతిమ్ అర్దాస్)ల్లో ఆమె పాల్గొన్నారు. ఆ తర్వాత అక్కడే జరిగిన కార్యక్రమంలో ప్రసంగించారు.