ప్రధానాంశాలు:
- మాజీ సీఎం బంధువు హత్య కేసులో విస్తుగొలిపే నిజాలు.
- సుపారీ ఇచ్చి హత్యచేయించిన సవతి తల్లి.
- ఆస్తి వివాదాలే హత్యకు కారణమని విచారణలో వెల్లడి.
సిద్ధార్థ సవతి తల్లి ఇందూ చౌహన్ ఈ హత్య చేయించినట్టు విచారణలో తేలింది. సిద్ధార్థ తండ్రి దేవేందర్ సింగ్ రెండో భార్య ఇందూ చౌహాన్ తిరుపతికి చెందిన శ్యామ్‌సుందర్ రెడ్డి, వినోద్లకు డబ్బులిచ్చి హత్య చేయించినట్టు విచారణలో వెల్లడయ్యిందని బెంగళూరు ఈస్ట్ జోన్ డీసీపీ సీకే బాబా తెలిపారు. ఈ హత్య కేసులో ఇందూ చౌహాన్‌ను అమృతహళ్లి పోలీసులు గురువారం అరెస్టు చేశారు. వాస్తవానికి బుధవారం రాత్రే ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. న్యాయస్థానం ముందు గురువారం ఉదయం హాజరు పరిచి అరెస్టు చేశారు.
అమృతహళ్లి పరిధిలోని దాసరహళ్లి అపార్ట్మెంట్లో ఒంటరిగా ఉండే సిద్ధార్థ సింగ్‌ను జనవరి 19న దుండగులు కిడ్నాప్ చేసి, కారులోనే సీటు బెల్టుతో గొంతుకు ఉరి వేసి హత్య చేశారు. అక్కడి నుంచి నెల్లూరు జిల్లా రాపూరు సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతంలో శవాన్ని పూడ్చి పెట్టారు. అమెరికాలో చదువుకున్న సిద్ధార్థ దాసరహళ్లి అపార్ట్మెంట్లో ఒంటరిగా ఉంటున్నాడు. ఆయన ఓ స్టార్టప్ కంపెనీ నడుపుతున్నట్టు పోలీసులు తెలిపారు.
ఈ హత్య వెనుక మరికొందరి హస్తం ఉందని అనుమానిస్తున్నారు. వ్యక్తిగత కక్షలు, ఆస్తి వివాదాలే హత్యకు కారణమని ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు. ఇదిలా ఉండగా.. ఈ హత్య కేసులో నిందితుడు శ్యామ్ మంగళవారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ కేసులో వినోద్ పట్టుబడటంతో శ్యామ్ సూసైడ్ చేసుకున్నాడు. అటు వినోద్ కూడా ఆత్మహత్యాయత్నం చేశాడు. గాయాలతో బయటపడ్డ అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు.