ఢిల్లీ వాసులకు డ్రైవర్ రహిత మెట్రో రైలు సేవలు నేటి నుంచే అందుబాటులోకి వచ్చాయి. ‘అధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా నడిచే మెరుగైన రవాణా వ్యవస్థకు సంబంధించిన నవ శకానికి ఇది ఆరంభం’ అని ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRC) పేర్కొంది. మజ్లిస్ పార్క్ – శివ్ విహార్ మధ్య 57 కి.మీ. పొడవైన పింక్ లైన్ మార్గంలోనూ డ్రైవర్ రహిత మెట్రో రైలు సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపింది. 2021 జూన్ నాటికి ఈ సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని వెల్లడించింది.
ఆ కొత్త లైన్ కూడా ఢిల్లీ మెట్రోలో మొత్తం 94 కిలోమీటర్ల మేర డ్రైవర్ రహిత రైలు సేవలు అందుబాటులోకి వచ్చినట్లు అవుతుంది. అప్పుడు ప్రపంచంలో డ్రైవర్ రహిత మెట్రో మార్గంలో 9 శాతం మార్గం కలిగి ఉన్న దేశంగా భారత్ నిలుస్తుందని డీఎంఆర్సీ తెలిపింది.
‘స్మార్ట్ విధానంపై ఇండియా ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో ఈ రైలు ప్రారంభం తెలుపుతోంది. నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్ (NCMC) ద్వారా ఢిల్లీ మెట్రో అనుసంధానం అయింది. కొన్నేళ్ల కిందటి వరకు స్మార్ట్ వ్యవస్థపై అంతగా దృష్టి పెట్టలేదు. అప్పట్లో నిరాసక్త వాతావరణం ఉండేది. పట్టణీకరణ, సాంకేతిక అభివృద్ధి విషయంలో చాలా తేడా కనిపించేది. మా ప్రభుత్వం ఆ పరిస్థితిని పూర్తిగా మార్చింది’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.