disha ravi: దిశ రవికి బెయిల్.. ప్రభుత్వ అహం దెబ్బతింటే దేశద్రోహం అభియోగమా? కోర్టు ఘాటు వ్యాఖ్యలు – delhi court granted bail to climate activist disha ravi in toolkit case

0
18


ప్రధానాంశాలు:

  • దిశ రవికి బెయిల్ మంజూరు చేసిన ఢిల్లీ కోర్టు.
  • దేశద్రేహం అభియోగం మోపడంపై మండిపాటు.
  • ప్రజాస్వామ్యంలో ప్రభుత్వపై పౌరులకు పరిశీలన సహజం.

టూల్‌కిట్ కేసులో అరెస్టయిన పర్యావరణ కార్యకర్త దిశ రవికి ఢిల్లీ కోర్టులో ఊరట లభించింది. ఢిల్లీ అదనపు సెషన్స్‌ జడ్జి ధర్మేంద్ర రాణా మంగళవారం ఆమెకు బెయిల్‌ మంజూరు చేశారు. రూ.లక్ష వ్యక్తిగత బాండు, అంతే మొత్తానికి మరో ఇద్దరి పూచీకత్తుతో ఆమెను విడుదల చేయాలని ఆదేశించారు. ఆమెకు బెయిల్ మంజూరు చేయకపోవడానికి సహేతుక కారణాలు కనిపించడం లేదని వ్యాఖ్యానించారు. నూతన సాగు చట్టాలపై ఆందోళనలు నిర్వహిస్తోన్న రైతులకు మద్దతుగా సోషల్ మీడియా ద్వారా టూల్‌కిట్‌ను షేర్ చేసినట్టు దశ రవి అభియోగాలు ఎదుర్కొంటున్నారు.

ఖలిస్థాన్‌ అనుకూల సంస్థ ‘పోయెటిక్‌ జస్టిస్‌ ఫౌండేషన్‌’ (పీజేఎఫ్‌)తో ఆమెకు ప్రత్యక్ష సంబంధాలు ఉన్నట్టు నిరూపించే ఆధారాలను పోలీసులు సమర్పించలేకపోయారని కోర్టు పేర్కొంది. వేర్పాటువాద ఆలోచనలతో ఆమెకు సంబంధం ఉందని చెప్పడానికీ ఆధారాల్లేవని తెలిపింది. గతంలో ఎటువంటి నేర చరిత్రలేని యువతికి అరకొర ఆధారాలను పరిగణనలో తీసుకుని బెయిల్‌ నిరాకరించడానికి ఎటువంటి ప్రాతిపదిక కనిపించడం లేదని న్యాయమూర్తి అన్నారు. సమాజంలో బలమైన మూలాలున్న ఆమెను నిర్బంధించి జైల్లో పెట్టడాన్ని కోర్టు తప్పుపట్టింది.

టూల్‌కిట్‌ గురించి పోలీసులు చెబుతున్నా దానిని ఉపయోగించి ఆమె హింసను ప్రోత్సహించినట్టు ఎక్కడా కనిపించలేదని న్యాయమూర్తి అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ తీరుపై పౌరుల నిరంతర పరిశీలన ఉంటుందనేది నా నిశ్చిత అభిప్రాయమని, కేవలం విధానాలతో విభేదించాలన్న మార్గాన్ని ఎంచుకున్నందుకు వారిని జైల్లో ఉంచడం తగదని హితవు పలికారు. ప్రభుత్వ అహంకారం దెబ్బతిన్నంత మాత్రాన దానికి మందుగా దేశద్రోహ అభియోగం మోపడం సమంజసం కాదని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

విభేదించడం, భిన్నాభిప్రాయం ఉండడం, అసమ్మతి తెలపడం, ఆక్షేపించడం అనేవి రాజ్య విధానాల్లో వాస్తవికతను ప్రోది చేసే చట్టబద్ధ సాధనాలని వ్యాఖ్యానించారు. వివేకవంతులైన, విడమరిచి చెప్పగల పౌరులు ఉండడం ఆరోగ్యకర, దేదీప్యమాన ప్రజాస్వామ్యానికి సూచిక అనేది నిర్వివాదాంశమని పేర్కొన్నారు. విభేదించే హక్కును రాజ్యాంగంలోని 19వ ఆర్టికల్ బలంగా చాటుతోందని, కమ్యూనికేషన్‌కు భౌగోళిక హద్దులేమీ లేవని జడ్జ్ అన్నారు.

సమాచారాన్ని పొందడానికి అందుబాటులో ఉన్న ఉత్తమ సాధానాలను వినియోగించుకునే హక్కు పౌరులకు ఉందని స్పష్టం చేశారు. వాట్సప్‌ గ్రూపును ఏర్పాటు చేయడం, అపాయకరం కాని టూల్‌కిట్‌కు ఎడిటర్‌గా ఉండడం తప్పేమీ కాదని కుండబద్దలు కొట్టారు.

విచారణకు దిశ సహకరించాలని, దర్యాప్తు అధికారులు పిలిచినప్పుడు హాజరు కావాలని సూచించిన కోర్టు.. తమ అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదని ఆదేశించింది. బెయిల్ మంజూరు కావడంతో మంగళవారం రాత్రి దిశ రవి తిహార్‌ జైలు నుంచి విడుదలయ్యారు. కుమార్తెకు బెయిల్‌ లభించడంతో న్యాయవ్యవస్థపై తమ విశ్వాసం మరింత పెరిగిందని దిశ రవి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here