ఈ సందర్భంగా జీవిత మాట్లాడుతూ.. ‘‘కరోనా పరిస్థితుల వల్ల చిత్ర పరిశ్రమ ఆటుపోట్లకు గురైంది. ఈ నేపథ్యంలో పరిశ్రమ మళ్లీ ట్రాక్‌లోకి వస్తుండటం, థియేటర్లు తిరిగి ప్రేక్షకులతో కళకళ లాడటం ఆనందంగా ఉంది’’ అని అన్నారు. నందమూరి తారకరత్న అద్భుతమైన నటుడని, ఆయనకి ఈ చిత్రం పెద్ద బ్రేక్ ఇవ్వాలని కోరుకుంటున్నానని వెల్లడించారు.
నిర్మాతల మండలి కార్యదర్శి టి. ప్రసన్నకుమార్ మాట్లాడుతూ.. ‘‘దేవినేని పాత్రకు తారకరత్న ప్రాణ ప్రతిష్ట చేశారు. అలాగే పాత్రధారులంతా వాళ్ల వాళ్ల పాత్రలకు చక్కటి న్యాయం చేకూర్చారు. ఇందులో చలసాని వెంకటరత్నం పాత్రలో నటించడం ఎంతో సంతృప్తిని కలిగించింది’’ అని అన్నారు. పాత్రికేయుడు సురేష్ కొండేటి మాట్లాడుతూ.. ‘‘వంగవీటి రంగా పాత్రను ఈ చిత్రంలో పోషించడం మరచిపోలేని అనుభూతిని ఇచ్చింది’’ అని చెప్పారు.
చిత్ర దర్శకుడు నర్రా శివనాగేశ్వర రావు (శివనాగు) మాట్లాడుతూ.. ‘‘దేవినేని నెహ్రూ పాత్రలో నందమూరి తారకరత్న పరకాయ ప్రవేశం చేశారు. సురేష్ కొండేటి వంగవీటి రంగగా అలరిస్తారు. గతంలో బెజవాడను బేస్ చేసుకుని కొన్ని సినిమాలు వచ్చినప్పటికీ వాటికి పోలిక లేకుండా ఈ చిత్రాన్ని తీశాం. ఇంతవరకు ఎవరూ చూపించని రీతిలో నిజాలను నిర్భయంగా ఇందులో చూపించాం. ఎందరు మెచ్చుకుంటారు, ఎంతమంది నొచ్చుకుంటారు అన్న అంశంతో పనిలేకుండా వాస్తవాలను ఆవిష్కరించాం. రంగాను ఎవరు చంపారు అన్నది చూపించాం’’ అని అన్నారు.