delhi si: 3 ఆస్పత్రుల్లో నో.. అంబులెన్స్‌లోనే ఎస్‌ఐ ఆత్మహత్య – si commits suicide inside ambulance in delhi

0
23


అంబులెన్స్‌లోనే ఓ ఎస్సై ఆత్మహత్య చేసుకున్న ఘటన దేశ రాజధాని ఢిల్లీలో అలజడి రేపుతోంది. అనారోగ్యంతో బాధపడుతున్న ఆ ఎస్‌ఐ అంబులెన్స్‌ను ఇంటికి రప్పించుకున్నాడు. హాస్పిటల్‌కు తీసుకెళ్లాల్సిందిగా అంబులెన్స్ సిబ్బందిని కోరాడు. కానీ, ఆయణ్ని చేర్చుకోవడానికి ఆస్పత్రి నిరాకరించింది. వరుసగా మూడు ఆస్పత్రుల్లోనూ ఇదే అనుభవం ఎదురైంది. దీంతో ఓ వస్త్రంతో అంబులెన్స్‌లో ఉరేసుకొని తనువు చాలించాడు.

రాజ్‌వీర్‌ సింగ్‌ (39) ఢిల్లీలో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్నారు. ద్వారక ప్రాంతంలో తన కుటుంబసభ్యులతో కలిసి నివసిస్తున్నారు. గత ఐదు రోజులుగా ఆయన సెలవులో ఉన్నారు. శుక్రవారం మధ్యాహ్నం ఆయన అంబులెన్స్ కోసం ఫోన్ చేశారు. ఆయన కాల్‌కు స్పందించి CATS (సెంట్రలైజ్డ్ యాక్సిడెంట్ అండ్ ట్రౌమా సర్వీసెస్) అంబులెన్స్‌ ఆయన ఇంటికి వచ్చింది. సమీపంలోని ఓ ఆస్పత్రికి వెళ్లగా ఆయణ్ని చేర్చుకునేందుకు అక్కడి సిబ్బంది నిరాకరించారు. ఆ తర్వాత మరో ఆస్పత్రికి వెళ్లగా అదే అనుభవం ఎదురైంది. చివరకు మూడో ఆస్పత్రిలోనూ ‘మేం చేర్చుకోం’ అని చెప్పేశారు.

అనారోగ్యంతో బాధపడుతున్న రాజ్‌వీర్‌ సింగ్‌‌ను ఈ అంశం కలచివేసినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన అంబులెన్స్‌లో ఉన్న ఓ వస్త్రంతో ఉరేసుకున్నారు. ఆ సమయంలో అంబులెన్స్ ఆయణ్ని IHBAS హాస్పిటల్‌లో చేర్పించడానికి వెళ్తోంది. రాజ్‌వీర్ సింగ్‌కు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఆయన తల్లిదండ్రులు హర్యానాలోని స్వగ్రామంలో ఉంటున్నారు.

శుక్రవారం (ఫిబ్రవరి 12) మధ్యాహ్నం చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీస్‌ శాఖలో ఇది కలకలం రేపుతోంది. అసలు ఆయనకు ఎదురైన అనారోగ్య సమస్య ఏమిటి? ఆయణ్ని ఆస్పత్రిలో చేర్చుకోవడానికి ఎందుకు నిరాకరించారు? అనే విషయాలను పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఆస్పత్రులు ఆయణ్ని ఎందుకు చేర్చుకోలేదని అంశంపై విచారణ చేస్తున్నట్లు డీసీపీ మీనా తెలిపారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here