దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియకు సంబంధించి మరో ముందడుగు పడింది. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఫార్మా సంస్థ భారత్ బయోటెక్ రూపొందించిన కరోనా వ్యాక్సిన్ ‘కొవాగ్జిన్’కు అత్యవసర వినియోగానికి అనుమతి లభించింది. దేశంలో ఇప్పటికే ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ కొవిషీల్డ్‌కు ఎమర్జెన్సీ వినియోగానికి అనుమతి లభించగా.. తాజాగా ఈ అనుమతి పొందిన రెండో వ్యాక్సిన్‌గా భారత్ బయోటెక్ టీకా నిలిచింది. అతి త్వరలో ఈ రెండు టీకాలు పూర్తి స్థాయి అనుమతులు పొందే అవకాశం ఉంది. ఆ తర్వాత భారత్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషనల్ ప్రక్రియ మొదలవుతుంది.