యూకేలో బయటపడిన కరోనా వైరస్ కొత్త వేరియంట్‌పై భారత్ బయోటెక్ రూపొందించిన కొవాగ్జిన్ సమర్థంగా పనిచేస్తోందని పరిశోధనలో తేలింది. ప్రపంచ దేశాలకు ఊరట కలిగించే వార్త ఇది. ఎందుకంటే కొత్త వైరస్ కొన్ని దేశాలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. వుహాన్ రకం వైరస్‌తో పోల్చితే యూకే రకం వైరస్ 70 శాతం అధిక వేగంతో విస్తరిస్తుండటమే అందుక్కారణం. ఈ కారణంగా ఐరోపాకు చెందిన పలు దేశాల్లో కొవిడ్ కేసుల సంఖ్య, మరణాలు బాగా పెరిగాయి. ప్రజాజీవితం అస్తవ్యస్తమవుతోంది.
కొవాగ్జిన్ టీకాపై ‘బయోఆర్ఎక్స్ఐవీ’ అనే వెబ్సైట్ ఓ అధ్యయనాన్ని ప్రచురించింది. ఈ వెబ్సైట్ బయాలజీ పరిశోధనా పత్రాలను ఆన్లైన్లో ప్రచురిస్తుంది. న్యూయార్క్‌కు చెందిన కోల్డ్ స్ప్రింగ్ హార్బర్ లేబొరేటరీ అనే లాభాపేక్ష లేని పరిశోధనా సంస్థ ఈ వెబ్‌జర్నల్‌ను నిర్వహిస్తోంది. ఈ వెబ్జర్నల్లో భారత్ బయోటెక్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్ఐవీ) శాస్త్రవేత్తలు తమ అభిప్రాయాలను పంచుకున్నారు.