భారత్ బయోటెక్ టీకా అనుమతి విషయంలో వస్తున్న విమర్శలపై ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) డైరెక్టర్ జనరల్ డాక్టర్ రణదీప్ గులేరియా స్పందించారు. కొవాగ్జిన్ క్లినికల్ ట్రయల్స్ కొనసాగుతున్నాయని, ఇది కేవలం బ్యాక్-అప్ టీకా మాత్రమేనని స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో సీరమ్ ఇన్స్టిట్యూట్ టీకా ప్రధానమైందని భావిస్తున్నాను.. భారత్ బయోటెక్ వ్యాక్సిన్ రీ-ఇన్ఫెక్షన్ విషయంలో అత్యవసర ఉపయోగం కోసం మాత్రమే’ అని రణదీప్ గులేరియా అన్నారు.
‘ఆ సమయానికి వారు డోస్‌లను సిద్ధం చేసుకుంటారు.. క్లినికల్ ట్రయల్స్ డేటాను పొందుతారు.. మూడో దశ డేటా దృఢమైందని చూపుతోంది.. టీకా అందుబాటులోకి వచ్చేనాటికి అది సమర్థవంతమైందని, సురక్షితం అని చూపించడానికి తగినంత సమాచారం ఉంది.. కానీ మొదట కొన్ని వారాలు సీరం ఇన్స్టిట్యూట్ వ్యాక్సిన్ ముఖ్యమైంది అవుతుంది.. ప్రస్తుతం 50 మిలియన్ డోస్‌లు అందుబాటులో ఉన్నాయి’ అని పేర్కొన్నారు.
టీకా గురించి ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ ‘భద్రత, రోగనిరోధక శక్తి’కి సంబంధించిన పూర్తి సమాచారాన్ని సమీక్షించిందని, ‘ప్రజా ప్రయోజనాల కోసం అత్యవసర పరిస్థితుల్లో షరతులతో కూడిన అనుమతి ఇచ్చామని కేంద్రం ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ‘టీకాల ఎంపిక, ముఖ్యంగా ఉత్పరివర్తన జాతుల ద్వారా సంక్రమణ విషయాన్ని పరిశీలిస్తున్నాం.. వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ కొనసాగుతాయని మంత్రిత్వ శాఖ తెలిపింది.