రష్యాలో అందుబాటులోకి వచ్చిన స్పుత్నిక్ వి వ్యాక్సిన్ తీసుకోవడానికి ఇప్పటికీ 38 శాతం మంది మాత్రమే ఆసక్తి చూపుతున్నారు. దీంతో వ్యాక్సినేషన్ కేంద్రాలు వెలవెలబోతున్నాయి. కానీ, ఐస్క్రీమ్ ఆఫర్ చేసిన మాస్కోలోని వ్యాక్సినేషన్ కేంద్రంలో మాత్రం జనాలు టీకా కోసం క్యూ కట్టారు. వ్యాక్సిన్ వేసుకున్నాక చల్లచల్లని ఐస్క్రీమ్ తింటూ సేదతీరుతున్నారు.
ఐస్క్రీమ్ ఆఫర్ ప్రకటించాక తమ వ్యాక్సినేషన్ సెంటర్ ముందు ప్రజలు బారులు కట్టారని డాక్టర్ నటాల్యా కుజెంతోవా తెలిపారు. సదరు వ్యాక్సినేషన్ కేంద్రానికి ఆమే చీఫ్గా వ్యవహరిస్తున్నారు. రెడ్ స్క్వేర్లోని షాపింగ్ మాల్ వద్ద ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ డ్రైవ్లో రోజుకు సరాసరి 300 మంది టీకా తీసుకుంటున్నారని ఆమె తెలిపారు.
చాలా దేశాల్లో వ్యాక్సిన్ల కొరత ఉంది. కానీ, రష్యాలో ఆ సమస్య లేదు. ప్రపంచంలోనే మొట్టమొదట అందుబాటులోకి వచ్చిన Sputnik V Vaccine డోసులు రష్యాలో కావాల్సిన దానికంటే ఎక్కువగానే అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం రోజుకు 66 వేల మంది వ్యాక్సిన్ తీసుకుంటున్నారని అక్కడి అధికారులు తెలిపారు. వ్యాక్సినేషన్ వేగం పెంచాల్సి ఉందని అభిప్రాయపడ్డారు.