కొవిడ్ మరణాల నుంచి తమ టీకా 100 శాతం రక్షణ కల్పిస్తుందని జాన్సన్ & జాన్సన్ తెలిపింది. వ్యాక్సిన్ తీసుకున్న 14 రోజుల్లోనే వైరస్ నుంచి రక్షణ లభిస్తుందని పేర్కొంది. యూఎస్‌లో ఇప్పటికే రెండు వ్యాక్సిన్లకు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. జాన్సన్ & జాన్సన్ అందించిన సమాచారం పరిశీలించి టీకా అనుమతిపై త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
తాము అభివృద్ధి చేసిన సింగిల్ డోస్ టీకా.. కరోనా వైరస్‌ను ఎదుర్కోవడంలో 66 శాతం సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు జాన్సన్ & జాన్సన్ ఇప్పటికే ప్రకటించింది. తీవ్ర కేసుల్లో 85 శాతం సమర్థత చూపించినట్లు వెల్లడించింది. సింగిల్ డోసు టీకా ప్రయోగాలను ప్రపంచ వ్యాప్తంగా 44 వేల మందిపై జరిపినట్లు తెలిపింది. ఆ తర్వాత ఫలితాలు వెల్లడించింది. అమెరికాలో జరిపిన ప్రయోగాల్లో వ్యాక్సిన్ 72 శాతం సమర్థత చూపించగా, లాటిన్ అమెరికా దేశాల్లో 66 శాతం, దక్షిణాఫ్రికాలో 57 శాతం సమర్థత కనబరిచిందని ఆ సంస్థ తెలిపింది.
అమెరికాలో కరోనా వైరస్ ఉధృతి ఏమాత్రం తగ్గడం లేదు. అక్కడ డిసెంబర్ నుంచే టీకాలు అందిస్తున్నారు. ఆస్ట్రాజెనెకా-ఆక్స్ఫర్డ్, మోడెర్నా వ్యాక్సిన్లను ఎమర్జెన్సీ వినియోగం కింద అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ రెండు టీకాలను రెండు డోసుల్లో తీసుకోవాల్సి ఉంది. జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థ వ్యాక్సిన్ ఒకే డోసు సరిపోతుంది. అంతేకాకుండా దీన్ని సాధారణ రిఫ్రిజిరేటర్ ఉష్ణోగ్రతల వద్దే నిల్వ చేసుకునే వెసులుబాటు ఉండటం మరో విశేషం.