ప్రధానాంశాలు:
- శరవేగంగా ‘లైగర్’ షూటింగ్
- పూరి జగన్నాథ్- విజయ్ దేవరకొండ కాంబోలో మూవీ
- షూటింగ్ స్పాట్లో ఛార్మితో విజయ్ షికార్లు
విజయ్ దేవరకొండను స్కూటీపై ఎక్కించుకుని షికారు కొట్టిన ఛార్మి ట్విట్టర్ వేదికగా ఈ ఫొటోస్ పోస్ట్ చేస్తూ ”విజయ్ దేవరకొండకు నా మీద ఎంత నమ్మకం ఉందనే విషయాన్ని మీరు ఇక్కడ గమనించవచ్చు. ముంబైలో లైగర్ సెట్స్ షూటింగ్ జరుగుతుండగా వచ్చిన గ్యాప్‌లో ఇలా షికార్లు కొట్టాం” అని పేర్కొంది. వాళ్లిద్దరూ అలా స్కూటీపై వెళ్తుండగా వెనకాల నుంచి పూరి జగన్నాథ్ గమనిస్తుండటం ఈ ఫొటోల్లో చూడొచ్చు.
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ లైగర్ మూవీ ప్రస్తుతం ముంబైలో షూటింగ్ జరుపుకుంటోంది. బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్‌తో కలిసి పూరి కనెక్ట్స్ బ్యానర్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన అనన్య పాండే హీరోయిన్గా నటిస్తోంది. లాక్డౌన్ కారణంగా కొన్ని నెలలు షూటింగ్ వాయిదా పడటంతో ఆ గ్యాప్ కవర్ చేసేలా ఇటీవలే షూటింగ్ ప్రారంభించి వేగంగా కంప్లీట్ చేస్తున్నారు పూరి జగన్నాథ్.
బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమా కావడంతో రియాలిటీకి దగ్గరగా ఉండేలా విజయ్ దేవరకొండ ప్రత్యేకంగా థాయ్‌లాండ్‌లో శిక్షణ కూడా తీసుకున్నారు. సెప్టెంబర్ 9వ తేదీన విడుదల కాబోతున్న ఈ పాన్ ఇండియా సినిమాపై విజయ్ దేవరకొండ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.