Bhanu Chander: పచ్చ కామెర్లకు మా అమ్మ మందు ఇచ్చేవారు.. ఎన్టీఆర్, బాలయ్యకు మా ఇంటి వైద్యమే: భానుచందర్ – actor bhanu chander tells his experience with n t rama rao and balakrishna

0
37


సీనియర్ నటుడు భానుచందర్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా తెలుగు, తమిళ చిత్రసీమల్లో తనదైన ముద్ర వేశారు భానుచందర్. కె.విశ్వనాథ్ దగ్గర నుంచి ఎస్.ఎస్.రాజమౌళి వరకు రెండు తరాల దిగ్గజాలతో పనిచేసిన అనుభవం ఆయనది. తెలుగులో ఇప్పటికీ ఆయనకు అవకాశాలు వస్తూనే ఉన్నాయి. ‘మనవూరి పాండవులు’ సినిమాతో తెలుగులో గుర్తింపు తెచ్చుకున్న భానుచందర్.. కెరీర్ ప్రారంభంలోనే ఎన్టీఆర్, ఏఎన్నార్ లాంటి దిగ్గజాలతో పనిచేశారు. ‘సత్యం శివం’ సినిమాలో ఎన్టీఆర్, ఏఎన్నార్‌తో కలిసి భానుచందర్ నటించారు.

కెరీర్ ప్రారంభంలోనే దిగ్గజాలతో కలిసి నటించడం పట్ల ఇటీవల భానుచందర్ స్పందించారు. ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో భానుచందర్ మాట్లాడుతూ.. ‘‘నేను ఎక్కడ కూర్చుంటే నువ్వూ అక్కడే కూర్చోవాలి, నేను ఎక్కడ భోజనం చేస్తే నువ్వూ అక్కడే కూర్చొని భోజనం చేయాలి అని రామారావు గారు నాకు రూల్స్ పెట్టేవారు’’ అని వెల్లడించారు.

సోనూ సూద్ పేరిట ఉచిత అంబులెన్స్ సర్వీస్.. ట్యాంక్ బండ్ శివకు అండగా రియల్ హీరో
‘‘వైజాగ్‌లో హైకోర్టు సీన్ జరుగుతోంది. అక్కడ రెండు కుర్చీలు మాత్రమే ఉన్నాయి. రామారావు గారు ఒక కుర్చీలో కూర్చున్నారు. రాఘవేంద్రరావు గారు, నిర్మాత, మిగిలిన టెక్నీషియన్స్ అంతా నిలబడి ఉన్నారు. నాగేశ్వరరావు గారు వస్తే గుడ్ మార్నింగ్ బ్రదర్ అని ఆయన్ని ఒక కుర్చీలో కూర్చోబెట్టారు. నేను చేతులు కట్టుకుని అక్కడే నిలబడ్డాను. నా వైపు చూసి ఏం బ్రదర్ టిఫిన్ చేశారా అని అడిగారు. నిలబడి ఉన్నారేంటి.. ఏయ్, నేను ఏం చెప్పాను.. బాబు నిలబడి ఉన్నాడు.. కుర్చీ ఏది అని కోపంగా అరిచారు. వెంటనే నాకు కుర్చీ వచ్చింది’’ అని భానుచందర్ చెప్పుకొచ్చారు.

సెట్‌లో అందరూ నిలబడి ఉంటే ఎన్టీఆర్, ఏఎన్నార్, తాను మాత్రమే కూర్చున్నామని.. కానీ, పెద్దవాళ్ల ముందు కూర్చోవడానికి తనకు చాలా ఇబ్బందిగా అనిపించిందని భానుచందర్ చెప్పారు. అయితే, ఎన్టీఆర్‌కు ఎదురుచెప్పే ధైర్యం ఎవ్వరూ చేసేవారు కాదని.. ఆయన చెప్పిన మాట వినాల్సిందేనని.. ఆయన మోనార్క్ అని భానుచందర్ గొప్పగా చెప్పుకొచ్చారు. తనకు ఎన్టీఆర్ అంత ప్రాధాన్యత ఇవ్వడానికి కారణం తన తల్లి అని భానుచందర్ వెల్లడించారు.

వరుణ్ తేజ్ ‘గని’ ఫస్ట్ లుక్ అదుర్స్.. జులైలో రింగ్‌లోకి మెగా ప్రిన్స్
‘‘మా అమ్మని ఎన్టీఆర్ అక్కయ్య గారు అని పిలిచేవారు. మా అమ్మ ఆయన్ని అన్నయ్య గారు అనేవారు. ఒకరోజు తెల్లవారుజామునే మా ఇంటికి ఫోన్ వచ్చింది. అక్కయ్య గారు మాకు పచ్చ కామెర్లు వచ్చాయి.. మీరు మందు ఇస్తారని విన్నాను.. మీ ఇంటికి ఎప్పుడు రావాలి అని అడిగారు. అన్నయ్య గారూ మీరు రావడమేంటి రేపు ఉదయాన్నే 4.30 గంటలకు నేనే తీసుకొస్తా అని చెప్పారు. నేను 4 గంటలకే సిద్ధంగా ఉంటానని ఆయన చెప్పారు. రెండు వేడి వేడి ఇడ్లీల్లో మందు కలిపి మా అమ్మ మూడు రోజులపాటు ఎన్టీఆర్‌కు ఇచ్చారు.. తగ్గిపోయింది’’ అని భానుచందర్ చెప్పుకొచ్చారు.

ఎన్టీఆర్ తరవాత బాలకృష్ణకు కూడా పచ్చ కామెర్లు వచ్చాయని.. ఆయనకు కూడా తన తల్లే మందు ఇచ్చారని భానుచందర్ తెలిపారు. ‘‘బాలకృష్ణ డాక్టర్ దగ్గరికి వెళ్లబోతుంటే.. డాక్టర్ ఎందుకు మా అక్కయ్య గారు ఉన్నారు, ఆమె వద్దకు వెళ్లండి అని రామారావు గారు చెప్పారు. బాలకృష్ణ ఉదయం 5 గంటలకు మా ఇంటి దగ్గర ఉండేవాడు. నేను షూటింగ్ చేసి అలసిపోయి పడుకునేవాడిని. కానీ, ఆ సమయంలో లేచి బాలకృష్ణకు కంపెనీ ఇచ్చేవాడిని. సినిమాల గురించి కాకుండా స్పోర్ట్స్ తదితర అంశాలపై మేమిద్దరం మాట్లాడుకునే వాళ్లం’’ అని అప్పటి విశేషాలను భానుచందర్ పంచుకున్నారు.

ఎన్టీఆర్, బాలకృష్ణ మాత్రమే కాకుండా సినిమా ఇండస్ట్రీలోని ఎంతో మందికి తన తల్లి పచ్చ కామెర్ల మందు ఇచ్చారని భానుచందర్ అన్నారు. క్రాంతి కుమార్, శివాజీ గణేషన్, ఎంజీర్ భార్య జానకి.. ఇలా ఎంతో మంది సినీ ప్రముఖులకు భానుచందర్ తల్లి పచ్చ కామెర్ల మందు ఇచ్చారట. అంతేకాకుండా, ప్రతి రోజూ భానుచందర్ ఇంటి ముందు తెల్లవారుజామున చాలా మంది పేదలు పచ్చ కామెర్ల మందు కోసం వేచి చూసేవారని చెప్పారు. వారందరికీ తన తల్లి ఉచితంగా పచ్చ కామెర్ల మందు ఇచ్చేవారని గుర్తుచేసుకున్నారు. కాగా, ప్రముఖ సంగీత దర్శకుడు మద్దూరి వేణుగోపాల్ (మాస్టర్ వేణు) తనయుడే ఈ భానుచందర్ అన్న విషయం తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here