కమర్షియల్ ప్రాంతాల్లో పార్కింగ్ ఫీజు 3 రెట్లు
ఇక షాపింగ్‌మాల్స్ లాంటి కమర్షియల్ ప్రాంతాల్లో గంట సమయం పాటు పార్కింగ్ చేస్తే విధించే ఫీజును 1.5 నుంచి 3 రెట్ల వరకు (ఏరియాను బట్టి) పెంచనున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో పాటు ఇతర రహదారుల్లో వాహనాల పార్కింగ్ కోసం నెలవారీ పాసులను ప్రవేశపెట్టనున్నట్లు చెప్పారు. స్కూల్ బస్సులు, నిర్మాణ సంస్థల వాహనాలు, సిటీ సర్వీస్ బస్సులు, క్యాబ్ కార్లు, ఇతర రవాణా వాహనాలను నిలుపేందుకు ఆయా సంస్థల నుంచి బల్క్ పార్కింగ్ రుసుమును వసూలు చేస్తారు.
డైరెక్టరేట్ ఆఫ్ అర్బన్ లాండ్ ట్రాన్స్పోర్ట్ (DULT) రూపొందించిన ఈ చట్టం బెంగళూరులో త్వరలో అమల్లోకి రానుంది. బృహత్ బెంగళూరు మహానగర పాలిక (బీబీఎంపీ) దీనికి సంబంధించిన డ్రాఫ్ట్‌ను విడుదల చేసింది. నగరంలో ట్రాఫిక్, వాహనాల పార్కింగ్ సమస్యను నివారించేందుకు పార్కింగ్ పాలసీ 2.0కు పట్టణ అభివృద్ధి శాఖ ఆమోదించిందని బెంగళూరు నగర పాలిక సంస్థ అధికారులు తెలిపారు.
కొత్త పార్కింగ్ విధానం వల్ల ప్రయోజనాలు:
ఈ నయా పార్కింగ్ పాలసీ అమల్లోకి వస్తే బెంగళూరులో ఇకపై ట్రాఫిక్ నియంత్రణలోకి వస్తుందని అధికారులు భావిస్తున్నారు. నగరవాసులు పబ్లిక్ రోడ్లపై ఎక్కడపడితే అక్కడ నిర్లక్ష్యంగా తమ వాహనాలను నిలపాలంటే జంకుతారని పేర్కొన్నారు. ప్రధాన రహదారులతో పాటు చిన్న రోడ్లపైనా వాహనాలు తేలిగ్గా ముందుకు కదలడానికి అవకాశం ఉంటుందని వివరించారు. ఇక అన్నింటికంటే ముఖ్యంగా ఈ విధానం ద్వారా ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరనుంది.