క్లాడియా కేవలం అందగత్తె, మోడల్ కావడం వల్లనే ఆ ఉద్యోగం ఇచ్చారని.. ఆమెకు ఆ ఉద్యోగం చేపట్టడానికి ఎలాంటి అర్హతలు లేవని కొంత మంది నెటిజన్లు విమర్శించారు. ఈ విమర్శల నేపథ్యంలో క్లూజ్ సిటీ కౌన్సిల్ తన నిర్ణయాన్ని మార్చుకుంది. ఉద్యోగానికి వెంటనే రిజైన్ చేయాలని క్లాడియాను కోరింది. దీంతో ఆమె అయిష్టంగానే ఆ ఉద్యోగాన్ని కోల్పోవాల్సి వచ్చింది.
ఉద్యోగం కోల్పోయిన తర్వాత క్లాడియా.. బిజినెస్ మ్యాగజీన్ ప్రతినిధితో మాట్లాడింది. క్లూజ్ సిటీ కౌన్సిల్ బోర్డు నిర్ణయం తనను ఆశ్చర్యానికి గురిచేసిందని చెప్పింది. కొంత మంది ప్రతిచర్యలు అతీతంగా ఉంటాయని వ్యాఖ్యానించింది. ఆ ఉద్యోగానికి అవసరమైన నైపుణ్యాలు, విద్యార్హతలన్నీ తనకు ఉన్నాయని తెలిపింది.
‘నేను లా చదివాను. యూరోపియన్ ఎథిక్స్లోనూ డిగ్రీ చేశాను. డ్యుయల్ డిగ్రీలు ఉన్నాయి. వృత్తిరీత్యా న్యాయవాదిని. దీనికి తోడు సొంతంగా హోస్టెస్ ఏజెన్సీ, ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థలను నిర్వహిస్తున్నాను. అయితే.. దురదృష్టవశాత్తు రొమేనియాలో నేటికీ పక్షపాతాలు ఉన్నాయి’ అని క్లాడియా అన్నారు.
‘ఒకరి వృత్తిని అందం ప్రభావితం చేయకూడదు. అడ్డుకోకూడదు’ అని క్లాడియా వ్యాఖ్యానించింది. మరోవైపు.. క్లాడియాను ఆ ఉద్యోగం నుంచి తప్పించినందుకు తనకు చాలా బాధ కలిగిందని క్లూజ్ కౌన్సిల్ ప్రెసిడెంట్ అలిన్ టిస్ అన్నారు. అయితే.. ఆమె నియామకానికి సంబంధించి ఎలాంటి అనుమానాలు, నిందలు రాకుండా ఉండేందుకు అలా చేయక తప్పలేదని వివరణ ఇచ్చారు.