ప్రధానాంశాలు:
- బసవతారకం హాస్పిటల్లో క్యాన్సర్ అవగాహన కార్యక్రమం
- వైద్య పరీక్షలు చేయించుకున్న బాలయ్య
- నేడు ప్రపంచ క్యాన్సర్ దినం
బసవతారకం ఇండో అమెరికన్ హాస్పిటల్, రీసెర్చ్ ఇన్స్టిట్యూట్-మెట్రోపాలిటన్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో ఈ క్యాన్సర్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రపంచ వ్యాప్తంగా ఏటా సుమారు కోటి మంది క్యాన్సర్ బారిన పడుతున్నారని చెప్పారు. సాధారణ క్యాన్సర్‌లో మూడోవంతు నివారించదగినదే అని చెప్పారు. క్యాన్సర్ వ్యాధి వచ్చాక ట్రీట్మెంట్ కంటే కూడా రాకుండా నివారణ ముఖ్యమని తెలిపారు. ప్రతి వ్యక్తి ఒక వయసు వచ్చాక ఏటా తప్పకుండా టెస్టులు చేయించుకోవడం అలవాటు చేసుకోవాలని బాలయ్య చెప్పారు. మహిళలు రొమ్ము క్యాన్సర్ గురించి అవగాహన పెంచుకోవాలని చెప్పారు. వ్యాధి ముదరక ముందు ఆస్పత్రికి వస్తే పూర్తిగా నివారణ చేయగలమని చెప్పారు.
ఈ సందర్భంగా డాక్టర్లు పలువురికి వైద్య పరీక్షలు నిర్వహించారు. బాలకృష్ణ కూడా పరీక్షలు చేయించుకున్నారు. ఈ సమయంలో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఆయనకు బీపీ టెస్ట్ నిర్వహిస్తుండగా చుట్టుపక్కల ఉన్నవారంతా ఒక్కసారిగా నవ్వారు. ఎప్పుడు హైఎనర్జీతో, ఎక్కువగా సీరియస్‌గా కనిపించే బాలకృష్ణ బీపీ ఎంత ఉండొచ్చో అని ఆసక్తిగా చూశారు. ఈ క్రమంలోనే అందరూ కలిసి ఫక్కున నవ్వారు. సీరియస్‌నెస్‌తో ఆయన పలువురి ఫోన్లు విసిరికొట్టడం, అభిమానిని కొట్టడం వంటివి గతంలో చేసిన సంగతి తెలిసిందే.