australian missing: అడవిలో ఆపద.. దుంపలు తింటూ 18 రోజులుగా అక్కడే, ప్రాణం ఇలా కాపాడుకున్నాడు – 58-year-old australian goes missing in the forest for 18 days, survives by eating wild mushrooms

0
20


58 ఏళ్ల ఓ వ్యక్తి అడవిలో ఆగమైపోయాడు. ఆయన ఆచూకీ కనుగొనే సరికి 18 రోజులు పట్టింది. అటవీ ప్రాంతంలోని ఓ డ్యామ్ వద్ద చెట్టు కింద కూర్చొని ఉన్న ఆయణ్ని సినీ ఫక్కీలో తొలుత అతడి భార్యే చూసింది. అక్కడి జలాశయంలో నీళ్లు తాగుతూ, ఆ పక్కనే ఉన్న అడవి పుట్టగొడుగులను తింటూ రెండు వారాలుగా తన ప్రాణాలు నిలుపుకున్నాడు. రెస్క్యూ టీమ్ ఆయణ్ని హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందించింది. ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్‌లో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి..

క్వీన్స్‌లాండ్‌కు (Queensland) చెందిన రాబర్ట్ వెబర్ (58) జనవరి 6న అదృశ్యమయ్యాడు. పనినిమిత్తం బయటకు వెళ్లిన అతడు ఎంతకీ ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు ఆందోళనకు గురయ్యారు. పోలీసులను ఆశ్రయించారు. వారి ఫిర్యాదుతో పోలీసులు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు.

రాబర్ట్ చివరిసారిగా కిల్‌కివన్‌లోని ఓ హోటల్‌లో కనిపించాడు. ఆ తర్వాత తన కారును డ్రైవ్ చేసుకుంటూ ఓ ఫామ్ దిశగా వెళ్లిపోయాడు. ఆయన వెంట పెంపుడు కుక్క కూడా ఉంది.

రాబర్ట్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదవశాత్తూ బురదలో చిక్కుకుపోయింది. గంటల తరబడి ప్రయత్నించినా బయట పడలేదు. రాబర్ట్ మూడు రోజుల పాటు ఆ కారులోనే ఉన్నాడు. సాయం చేసే వారు ఎవరూ లేరు. ఆ మార్గం వెంట ఎవరూ రాలేదు. దాహంతో రాబర్ట్ గొంతు ఎండిపోతోంది. ఆకలితో కడుపులో పేగులు మెలిపెట్టినట్లు అవుతోంది..

అర్జెంటుగా నీళ్లు తాగకపోతే ప్రాణాలు పోయేట్టు ఉన్నాయి. నీటి జాడ వెతుకుతూ అడవి బాట పట్టాడు రాబర్ట్. కి.మీ. దూరం నడిచాక ఓ డ్యాం కనిపించింది. అక్కడ కడుపు నిండా నీళ్లు తాగాడు. కాస్త ఉపశమనం. ఆ తర్వాత అక్కడే ఉన్న ఓ చెట్టు నీడకు చేరాడు. ఆ పక్కనే గడ్డి పొదల్లో అడవి పుట్టగొడుగులు (Wild Mushrooms) కనిపించాయి.

పుట్టగొడుగులు తింటూ, ఆ జలాశయంలో నీళ్లు తాగుతూ రోజుల తరబడి రాబర్ట్ అలాగే ఉండిపోయాడు. తన కోసం ఎవరో ఒకరు వస్తారని ఆశగా ఎదురుచూశాడు. చివరికి ఆ ఆశ తన భార్య రూపంలోనే నిజమైంది. అతడి ముఖం ఓ వెలుగు వెలిగింది.

Robert

అడవిలో రాబర్ట్ వెబర్

రాబర్ట్ భార్య ఇచ్చిన సమాచారంతో అక్కడికి చేరుకున్న రెస్క్యూ టీమ్.. ఆయనకి ప్రాథమిక చికిత్స చేసి వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

కారు నిలిచిపోయిన ప్రాంతం నుంచి సరిగ్గా 3 కి.మీ. దూరంలో రాబర్ట్‌ను గుర్తించారు. ఆ పరిసరాల్లో ఎక్కడో ఉండి ఉంటాడనే నమ్మకంతో అధికారులు బృందాలుగా విడిపోయి అక్కడే గాలించారు. విచిత్రమేమిటంటే.. సెర్చ్ టీమ్‌లో కొంత మంది ఆ డ్యామ్‌ను మూడుసార్లు దాటుకుంటూ వెళ్లారు. కానీ, ఆయన తన భార్య కంట కనబడాలని రాసిపెట్టి ఉందేమో!

గతేడాది అలస్కాలో 30 ఏళ్ల ఓ యువకుడు కూడా ఇలాగే గల్లంతయ్యాడని అధికారులు తెలిపారు. కనిపించకుండాపోయిన 23 రోజుల తర్వాత అతడి ఆచూకీ కనుగొన్నారు. పైగా అది గడ్డకట్టించే చలి కాలం. మంచులో చిక్కుకున్న అతడిని ఆస్ట్రేలియా దళాలు గుర్తించాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here