ప్రధానాంశాలు:
- గోపీచంద్, తమన్నా హీరోహీరోయిన్లుగా ‘సీటీమార్’
- ఐటెం సాంగ్ కోసం అప్సర రాణి
- మణిశర్మ బాణీల్లో ఫాస్ట్ బీట్ సాంగ్
మాచో స్టార్ గోపీచంద్ హీరోగా మాస్ డైరెక్టర్ సంపత్ నంది దర్శకత్వంలో ‘సీటీమార్’ అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. వైవిద్యభరితమైన కథాంశంతో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై ప్రొడక్షన్ నెం.3గా రూపొందుతున్న ఈ సినిమాలో గోపీచంద్ సరసన తమన్నా హీరోయిన్గా నటిస్తోంది. మణిశర్మ బాణీలు కడుతున్నారు. స్పోర్ట్స్ నేపథ్యంలో తెలుగు తెరపై గతంలో ఎన్నడూ చూడని సన్నివేశాలతో ఈ మూవీ రూపొందిస్తున్న సంపత్ నంది.. చిత్రంలోని పాటలపై స్పెషల్ ఫోకస్ పెట్టారట. ఇందులో భాగంగానే థియేటర్స్ దద్దరిల్లే ఐటెం సాంగ్ ప్లాన్ చేసి అప్సర రాణిని రంగంలోకి దించుతున్నారు.
తాజాగా ‘సీటీమార్’ సినిమా కోసం అప్సర రాణితో ఐటెం సాంగ్ షూట్ చేయబోతున్నామని పేర్కొంటూ డైరెక్టర్ సంపత్ నంది ట్వీట్ చేశారు. ”పటాకా రాణి అప్సర రాణికి వెల్కమ్.. సీటీమార్ సినిమాలో ఈమెతో చేయబోయే ఐటెం సాంగ్ అందరికీ లైఫ్ లాంగ్ గుర్తుంటుందని నమ్మకంగా చెబుతున్నా” అని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే షూటింగ్ పార్ట్ ఫినిష్ చేసిన ఆయన, ఇక అప్సరతో ఐటెం సాంగ్ షూట్ చేయనున్నారట. మంచి మసాలా పాటగా ఈ సాంగ్ తెలుగు ప్రేక్షకులను హుషారెత్తించబోతుందట.