అల్లు అర్జున్ అతిథిగా విచ్చేసిన ‘సామ్ జామ్’ ఎపిసోడ్ ప్రస్తుతం ‘ఆహా’లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ షోలో అల్లు అరవింద్ సర్ప్రైజ్ గెస్ట్‌గా విచ్చేశారు. ‘‘అల్లు అర్జున్ ఇప్పుడు చాలా స్ట్రిక్ట్‌గా, డిసిప్లెయిన్డ్గా, హార్డ్ వర్కింగ్ చేస్తూ ఉన్నారు. చిన్నప్పుడు కూడా ఇలానే ఉండేవారా?’’ అని అల్లు అరవింద్‌ను సమంత ప్రశ్నించారు. వెంటనే అల్లు అరవింద్ రెండు చేతులూ జోడించి నమస్కారం పెట్టారు. దీంతో అక్కడ నవ్వులు పువ్వులు పూశాయి. చిన్నప్పుడు బన్నీ చాలా అల్లరి అని అరవింద్ అన్నారు. బన్నీ గురించి చెప్పడానికి చాలా ఉన్నాయి కానీ.. యూత్‌కు నచ్చేలా ఒకటి చెప్తానంటూ అల్లు అర్జున్ స్కూల్ విషయం ఒకటి చెప్పారు.
‘‘బన్నీ 11వ తరగతి చదివేటప్పుడు ఇంటికి ఫోన్ వచ్చింది. తండ్రి వచ్చి బన్నీ రిపోర్ట్ తీసుకోవాలని కబురు. సరే అని బన్నీని తీసుకుని వెళ్లాను. టీచర్ రిపోర్ట్ ఇచ్చారు.. చూశాను. అన్నీ ఇరవైలు, పాతికలు ఉన్నాయి. టీచర్ నన్ను వాయించేస్తాడని నేను ముందుగానే సిద్ధమైపోయాను. నేను ‘సార్’ అని టీచర్‌ను అంటే.. ఆయన ‘యు కెన్ గో సార్’ అన్నాడు. నాకు అర్థంకాలేదు. ఇంకేమైనా చెప్తాడేమో అని చూస్తున్నాను. ‘నథింగ్ టు సే సార్.. యు కెన్ గో’ అన్నాడు. వెనక్కి తిరిగి బన్నీని చూశాను.. అమాయకంగా వెళ్లిపోదాం అని తల ఊపాడు. ఇంటికి వెళ్లిపోయాం.
తరవాత బన్నీ ఫ్రెండ్స్ ద్వారా, వేరే విధంగా నాకు తెలిసింది ఏంటంటే.. ‘మా నాన్న వస్తున్నాడు రేపు. ఆయన్ని మీరు ఏం క్లాసులు పీకడానికి వీల్లేదు. మీకు వయసులో ఉన్న అమ్మాయి ఉంది.. ఆమె నా లవ్‌లో పడిపోవచ్చు చెప్పలేం’ అని టీచర్‌తో బన్నీ అన్నాడట. ఆ మాస్టారు తన గోడును బన్నీ ఫ్రెండ్స్ వద్ద, ఇతరుల వద్ద వెల్లుబుచ్చుకున్నాడు పాపం. ఆయన్ని ఎలా బ్లాక్మెయిల్ చేశాడంటే.. ఆయన భయపడిపోయాడు’’ అని తన కొడుకు గురించి అల్లు అరవింద్ చెప్పుకొచ్చారు.
‘వీడు ఏమవుతాడా?’ అని ఎన్నో సార్లు తనకు అనిపించిందని.. బన్నీ తల్లి అయితే దిగులు పెట్టుకునేదని అరవింద్ వెల్లడించారు. తన గురించి ఇంట్లో వాళ్ల ఆలోచన ఎలా ఉండేదో చెప్పడానికి అల్లు అర్జున్ స్వయంగా ఒక ఉదాహరణ చెప్పారు. ‘‘మా తాతయ్యకు మేం మొత్తం 8 మంది మనవడు, మనవరాళ్లం ఉన్నాం. ఆయన చనిపోయిన తరవాత నాకు మాత్రమే రూ.15 లక్షల బీమా వచ్చింది. మిగిలిన వాళ్లు ఎవ్వరికీ రాలేదు. ఆయన ఎప్పుడు వేశారు అని వాకబు చేశాం. నేను 4వ తరగతి చదువుతున్నప్పుడు కొంత డబ్బును నా పేరిట ఆయన వేశారు. అలా పెరిగిన డబ్బును నాకు ఇచ్చారు. ఎందుకంటే, అందరిలో వీడెక్కడే పనికిరానోడు.. వీడు ఎలా బతుకుతాడా అని భయపడి ఆయన నా ఒక్కడికే ఇన్సూరెన్స్ చేశారు’’ అని బన్నీ వెల్లడించారు. అయితే, ప్రస్తుతం తన కజిన్స్ అందరిలో తానే ఎక్కువ సంపాదిస్తున్నానని బన్నీ చెప్పారు.