
‘అల వైకుంఠపురములో’ రీయూనియన్
ఈ సందర్భంగా బన్నీ మాట్లాడుతూ.. ‘‘గతేడాది సంక్రాంతి నుంచి ఇప్పటి వరకు మొత్తం సంవత్సర కాలం ప్రపంచానికి చాలా బ్యాడ్ ఇయర్. కానీ అందరూ అంటూ ఉంటారు.. బన్నీ గారు మీకు మాత్రం ఇది వెరీ స్పెషల్ ఇయర్ అని. ఇది కచ్చితంగా నిజం. నిజంగా ఎవరైనా కంప్లయింట్ చేయొచ్చు కానీ.. నేను మాత్రం కంప్లయింట్ చేయకూడదు. ఎందుకంటే నా లైఫ్ టైమ్‌లో ఒక మంచి జ్ఞాపకం ఈ సినిమా. నా బెస్ట్ ఫిలిం 2020లో వచ్చింది. ఒక వేళ ఈ సినిమా ఆ సమయంలో విడుదల కాకుండా వేసవిలో విడుదల చేద్దాం అని అనుకొని ఉండుంటే ఇంత అద్భుతమైన అనుభవాన్ని మేం కోల్పోయి ఉండేవాళ్లం. కోవిడ్‌కి ముందు ఏడాదిన్నర ఇంట్లో కూర్చున్నా.. ఆ తరవాత ఒక సంవత్సరం ఇంట్లో కూర్చున్నా ఎక్కడా బోర్ కొట్టలేదు నాకు. ఎందుకంటే, ఈ సినిమా అంత ఎనర్జీ ఇచ్చింది’’ అని చెప్పుకొచ్చారు.
ఇక తన లైఫ్‌లో ఒక విషయం గురించి అందరితో పంచుకోవాలంటూ మిగిలిన హీరోలతో పోల్చుకుంటూ తన రికార్డును ప్రస్తావించారు బన్నీ. ‘‘ప్రతి నటుడికీ ఏదో ఒక సమయంలో ఆల్ టైమ్ రికార్డ్ పడుతూ ఉంటుంది. జర్నీలో అదొక బ్యూటిఫుల్ మైల్స్టోన్ అవుతుంది. ఉదాహరణకు.. కళ్యాణ్ గారికి ‘ఖుషి’ ఆల్ టైమ్ రికార్డ్. అది ఆయన ఏడో సినిమా అనుకుంటా. జూనియర్ ఎన్టీఆర్ గారికి ఏడో సినిమా ‘సింహాద్రి’ ఆల్ టైమ్ రికార్డ్ ఫిలిం. చరణ్‌కి రెండో సినిమా ఆల్ టైమ్ రికార్డ్. ఇలా అందరికీ ఆల్ టైమ్ రికార్డ్ సినిమా ఉంది. నాకెప్పుడు పడుతుందని నేను కూడా అనుకునేవాడిని. అందరికీ చాలా ముందుగా పడింది.. నాకు 20 సినిమాలు పట్టింది. ఇది నా మొదటి అడుగు. ఇకపై నేనేంటో చూపిస్తా’’ అని అల్లు అర్జున్ వెల్లడించారు.