ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు అతి త్వరలో ఎన్నికల నగారా మోగనుంది. ఇందుకోసం భారత ఎన్నికల సంఘం రంగం సిద్ధం చేసినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఈ నెల (ఫిబ్రవరి) మూడో వారంలో లేదా నాలుగో వారంలో ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే.. ఇక దేశంలో మరోసారి ఎన్నికల హడావుడి మొదలుకానుంది. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న రాష్ట్రాల్లో రెండు అతిపెద్ద, కీలకమైన రాష్ట్రాలు ఉన్న సంగతి తెలిసిందే.
కేంద్ర ఎన్నికల సంఘానికి చెందిన అధికారుల బృందం ఇటీవల పశ్చిమ బెంగాల్, అసోం రాష్ట్రాల్లో పర్యటించింది. ఎన్నికల సన్నద్ధత, తదితర అంశాలను పరిశీలించింది. అతి త్వరలో కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల్లో ఆ బృందం పర్యటించనుంది. 6 రోజుల పాటు అధికారులు ఆ మూడు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఆ వెంటనే ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది.