టన్నెల్లో చిక్కుకున్న తన ఆత్మీయుల గురించే ఆ శునకం కళ్లు కాయలు కాచేలా అక్కడ ఎదురుచూస్తోంది. వారితో దానికి అలాంటి అనుబంధం ఉంది మరి. ప్రమాదం నుంచి బయటపడ్డ కార్మిడొకరు ఆ శునకం గురించి వివరాలు చెప్పాడు.
రెండేళ్ల వయసున్న Bhutia బ్రీడ్‌కు చెందిన ఆ శునకం పేరు ‘బ్లాకీ’. టన్నెల్లో పనిచేస్తున్న కొంత మంది కార్మికులు తాము తెచ్చుకున్న ఆహారంలో రోజూ దానికి కొంత పెట్టేవారు. ఆ విశ్వాసంతో అది వారితోనే ఉండేది. సొరంగంలో కార్మికులు పనిచేసుకుంటుంటే.. బ్లాకీ వారితో వెళ్లి ఓ మూలన కూర్చునేది. కాసేపు అక్కడే పడుకునేది.
‘కార్మికులు టన్నెల్ నుంచి బయటకు వచ్చేంత వరకు బ్లాకీ అక్కడే తచ్చాడుతూ ఉండేది. సాయంత్రం నాలుగింటి తర్వాత కార్మికులు తిరిగొచ్చాక ఆ శునకం అక్కడ నుంచి వెళ్లిపోయేది’ అని రాజిందర్ కుమార్ అనే కార్మికుడు చెప్పాడు.
‘ఆ రోజు బ్లాకీ ఎక్కడికో వెళ్లొచ్చేసరికి జలప్రళయం సంభవించింది. అక్కడికి తిరిగొచ్చే సరికి అందరూ కొత్త వాళ్లు కనిపించారు. తన వాళ్లు ఏదో ఆపదలో చిక్కుకున్నారని దానికి అర్థమైంది. వారి కోసం ఎదురుచూస్తూ 3 రోజులుగా అక్కడే ఉంది’ అని అజిత్ కుమార్ అనే స్థానికుడు తెలిపాడు.
శునకానికి, మనిషికి మధ్య విడదీయరాని బంధానికి ఈ ఘటన మరో తార్కాణంగా నిలుస్తోంది. బ్లాకీ నిరీక్షణ ఫలించాలని, టన్నెల్లో చిక్కుకున్న కార్మికులు క్షేమంగా బయటకు రావాలని ప్రార్థిద్దాం..