బాధితుడి ఇంట్లో ఉండే వాళ్లందరి గురించి పోలీసులు ఆరా తీశారు. ఐదో తరగతి చదువుతున్న వారి 11 ఏళ్ల బాలుడి ప్రవర్తనా తీరు అనుమానాస్పదంగా కనిపించింది. దీంతో అతడిని అదుపులోకి తీసుకొని విచారించారు. ఆ బాలుడు చెప్పిన విషయాలు విని పోలీసులు నోరెళ్లబెట్టారు.
తండ్రి ఇ-మెయిల్‌ను హ్యాక్ చేసి బెదిరింపు సందేశాలు పంపించాడు ఆ బాలుడు. ఇ-మెయిల్ పాస్వర్డ్ కూడా మార్చేశాడు. ఇంట్లో వాళ్ల ప్రైవేట్ ఫొటోలను సెల్ ఫోన్లో రహస్యంగా చిత్రీకరించి వాటిని తండ్రికి మెయిల్ చేశాడు. పది కోట్ల రూపాయలు పంపించకపోతే ఆ ఫొటోలను ఇంటర్నెట్లో పెడతానని బెదిరించాడు.
ఇదంతా ఎలా నేర్చుకున్నాడు?
ఐదో తరగతి చదువుతున్న ఆ బాలుడు ఇంటర్నెట్లో సెర్చ్ చేసి సైబర్ క్రైమ్ గురించి తెలుసుకున్నాడు. పట్టుబడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో నేర్చుకున్నాడు. సైబర్ క్రైమ్‌కు సంబంధించి పదుల సంఖ్యలో యూట్యూబ్ వీడియోలను చూశాడు. ఆ విద్యనంతా కన్నతండ్రిపైనే ప్రదర్శించాడు. అది కూడా జనవరి 1నే మొదలుపెట్టాడు. తండ్రి ఇ-మెయిల్‌ను హ్యాక్ చేసి బెదిరింపు సందేశాలు పంపించడం ప్రారంభించాడు.
11 ఏళ్ల కుమారుడి తెలివి చూసి ఆనందపడాలో, ఏడ్వాలో తెలియని గందరగోళంలో ఆ తల్లిదండ్రులు ఉన్నారు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్ల కారణంగా పిల్లలు ఎలా పెడదారి పడుతున్నారనడానికి తార్కాణం ఈ ఘటన. ఇది నాణేనికి రెండో కోణం. టెక్నాలజీ వల్ల ఎంత ఉపయోగం ఉందో, అంతే నష్టం కూడా ఉంది. దాన్ని సరైన విధంగా వాడినప్పుడే సమాజానికి ఉపయోగపడే ఫలితాలు వస్తాయి. తల్లిదండ్రులందరికీ ఈ ఘటన ఒక పాఠం..!