సెల్‌ఫోన్ వెలుగుల మధ్య అల్లు అర్జున్.. బన్నీ ఫ్యాన్స్‌తో నిండిపోయిన రంపచోడవరం

0
24తూర్పుగోదావరి జిల్లాలోని రంపచోడవరం జంక్షన్ మంగళవారం రాత్రి స్టైలిష్ స్టార్ అభిమానులతో నిండిపోయింది. తమ అభిమాన హీరోను కళ్లారా చూసుకోవడానికి వేలాదిగా బన్నీ అభిమానులు రంపచోడవరం జంక్షన్‌కు తరలివచ్చారు. సెల్‌ఫోన్ వెలుగుల్లో బన్నీ చూసుకుని ఆనందపడ్డారు. కారు రూఫ్ టాప్‌లో నుంచి బయటికి వచ్చిన బన్నీ.. తనకోసం వేచి చూస్తున్న అభిమానులకు అభివాదం చేశారు. ఈ సందర్భంగా తీసిన ఒక ఫొటోను బన్నీ ట్వీట్ చేశారు. ‘థాంక్ యు రంపచోడవరం’ అని క్యాప్షన్ పెట్టారు.

అల్లు అర్జున్ ప్రస్తుతం ‘పుష్ప’ సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ గత నెల రోజులుగా రంపచోడవరం సమీపంలోని మారేడుమిల్లి ఆటవీ ప్రాంతంలో జరుగుతోంది. ఈ షెడ్యూల్ మంగళవారం పూర్తయినట్టు సమాచారం. షూటింగ్ జరుగుతున్న సమయంలో అభిమానులు మారేడుమిల్లి వచ్చినా బన్నీ కలవడానికి వీలు పడలేదట. అందుకే రెండు రోజుల క్రితం మోతుగూడెం సమీపంలో కొంత మంది అభిమానులను కలిశారు. ఇప్పుడు హైదరాబాద్ తిరిగి వచ్చేస్తుండగా దారిలో రంపచోడవరం వద్ద వేలలో పోగైన అభిమానులను అభివాదం చేశారు.

ఇదిలా ఉంటే, ‘పుష్ప’ సినిమాలో బన్నీ సరసన రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తున్నారు. భారీ అంచనాల నడుమ తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని ముత్తంశెట్టి మీడియా సౌజన్యంతో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. మిరోస్లావ్ క్యూబా బ్రోజెక్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఆగస్టు 13న ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here