‘ఫిబ్రవరి 16న నా పెళ్లి జరగాల్సి ఉంది. ఇంటి ముందు ఇలా మురుగు పారుతోంది. పెళ్లి కొడుకు ఎలా వస్తాడు? పెళ్లి బరాత్ ఎలా చేసుకోవాలి? ఈ నగర పంచాయతీ వాళ్లు గానీ, స్థానిక ఎమ్మెల్యే గానీ ఏదైనా చేస్తారా, లేదా?’ అని కామిని అనే ట్విటర్ యూజర్ నిలదీసింది. స్థానిక ఎమ్మెల్యే, మంత్రితో పాటు హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌ను ట్యాగ్ చేసింది. తన పెళ్లికి సంబంధించిన శుభలేఖను కూడా జత చేసింది.
ఫరీదాబాద్‌లో వార్డు నంబర్ 5లో తన ఇంటి ముందు మురుగునీటి కాలువ రహదారిపై పొంగి పొర్లుతోందని సదరు యువతి తెలిపింది. మురుగు నీటి గుంతలో ఓ యువకుడు బైక్‌తో పాటు పడిపోయిన దృశ్యాలను కూడా ట్వీట్ చేసింది.
ఈ ఘటనపై సీఎం కార్యాలయం తీవ్రంగా స్పందించింది. బాధ్యులైన అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. తక్షణం చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించింది. విధుల పట్ల నిర్లక్ష్యం వహించే అధికారులతో సరిగ్గా పని చేయించుకోవాలంటే ఈ స్థాయిలో నిలదీయాల్సిందే మరి!