సీఎం సభలో బిర్యానీ విందు.. 145 మందికి అస్వస్థత, ఒకరి మృతి!

0
21సోం ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్‌ హాజరైన ప్రభుత్వ కార్యక్రమంలో అపశ్రుతి చోటు చేసుకుంది. బిర్యానీ విందు ఆరగించిన తర్వాత 145 మంది అస్వస్థతకు గురయ్యారు. వీరిలో ఆరోగ్య శాఖ మంత్రి హిమంత బిశ్వ శర్మ కూడా ఉన్నారు. అస్వస్థతకు లోనైన ఆయణ్ని దిపు మెడికల్‌ కాలేజ్‌లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. కర్బి అంగ్లాంగ్‌ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఓ వ్యక్తి చికిత్స పొందుతూ మరణించడం కలకలం రేపుతోంది. అతడు ఫుడ్‌ పాయిజన్‌తోనే మరణించాడా? లేదా మరేదైనా కారణం ఉందా? అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. అతడి రక్త నమూనాలను సేకరించి పరీక్షలకు పంపించినట్లు అధికారులు తెలిపారు.

విందుకు హాజరైన వారిలో పలువురు వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నారు. బిర్యానీ తీసుకున్న అనంతరం తాను కూడా అనారోగ్యానికి గురయ్యానని, ఇప్పుడు కోలుకున్నానని ఆరోగ్య మంత్రి హిమంత బిశ్వ శర్మ తెలిపారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు అధికారులు వెల్లడించారు.

సీఎం సోనోవాల్‌ మంగళవారం (ఫిబ్రవరి 2) కర్బి అంగ్లాంగ్‌ జిల్లాలో మెడికల్‌ కాలేజీలో ఎంబీబీఎస్‌ అకడమిక్‌ సెషన్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎనిమిది వేల మంది పాల్గొన్నట్లు తెలుస్తోంది. కార్యక్రమం ముగిసిన వెంటనే వీరందరికీ బిర్యానీ ప్యాకెట్లను పంపిణీ చేశారు. అ తర్వాత కొంత మంది అస్వస్థతకు గురయ్యారు. మంగళవారం రాత్రి వరకు 145 మంది హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యారు. వారిలో ఇప్పటివరకు 28 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారని అధికారులు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here