షోలో హిందూ దేవతలపై జోకులు.. కమేడియన్‌కు ఎట్టకేలకు సుప్రీంలో ఊరట!

0
28హిందూ దేవుళ్లు, దేవతలను తన షోలో కించపరిచాడనే ఆరోపణలపై అరెస్టయిన మధ్యప్రదేశ్ కమేడియన్ మునావర్ ఫరూకీకి ఎట్టకేలకు సుప్రీంలో ఊరట లభించింది. ఆయనకు సర్వోన్నత న్యాయస్థానం మధ్యంతర బెయిల్‌ను శుక్రవారం మంజూరు చేసింది. అలాగే, మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి కూడా నోటీసులు జారీచేసింది. గతంలో మునావర్ ఫరూకీకి బెయిల్‌ను కోర్టు మూడుసార్లు తిరస్కరించింది. జనవరి 28న చివరిసారిగా మధ్యప్రదేశ్ హైకోర్టు అతడికి బెయిల్ నిరాకరించడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించాడు.

ఇండోర్‌లో జనవరి 1న మునావర్ తన షోలో చేసినట్టు బీజేపీ ఎమ్మెల్యే కుమారుడు ఫిర్యాదు చేయడంతో అతడిపై పోలీసులు కేసు నమోదుచేశారు. అతడితోపాటు మరో నలుగుర్ని అదుపులోకి తీసుకున్నారు. వీరంతా హిందూ దేవతలు సహా కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కించపరిచేలా జోక్‌లు వేసినట్టు బీజేపీ ఎమ్మెల్యే కుమారుడు ఏకలవ్వ సింగ్ గౌర్ తన ఫిర్యాదులో ఆరోపించారు.

ఈ కేసులో బెయిల్ కోసం ఫరూకీ ప్రయత్నించగా.. హైకోర్టు తిరస్కరించింది. ‘ఇప్పటివరకు సేకరించిన సాక్ష్యాలు / రుజువుల ఆధారంగా వాణిజ్యపరంగా బహిరంగ స్టాండప్ కామెడీ షో‌లో ప్రధాన నిందితుడు.. ఉద్దేశపూర్వకంగా భారతీయుల మతపరమైన భావాలను ఉద్రేకపరిచేలా అసభ్యకరమైన జోక్‌లు వేశారని’ హైకోర్టు పేర్కొంది. అయితే, నిర్వాహకులు ఆహ్వానం మేరకు కామెడీ షో ప్రదర్శించారని, హిందూ దేవుళ్లపై ఎటువంటి అభ్యంతరకమైన వ్యాఖ్యలు చేయలేదని ఫరూకీ తరుఫు లాయర్ వాదించారు.

కానీ, ఈ వాదనలను కోర్టు తోసిపుచ్చింది. దీనిపై విచారణ ఇంకా కొనసాగుతున్నందున మరిన్ని ఆధారాలు, సాక్ష్యాల అవకాశాన్ని తోసిపుచ్చలేమని పేర్కొంది. ఉత్తర్ ప్రదేశ్‌లోని కామెడీ షోపై దాఖలు చేసిన ఇలాంటి కేసులో ఆయన సోషల్ మీడియా పోస్టులను కూడా కోర్టు ప్రస్తావించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here