లాక్‌డౌన్ సడలింపులు: కరోనాాతో సహజీవనమే.. ఓ నిర్ణయానికొచ్చిన బ్రిటన్

0
17ప్రపంచంలోనే అందరి కంటే ముందు కోవిడ్ వ్యాక్సినేషన్‌ను యునైటెడ్ కింగ్‌డమ్ మొదలుపెట్టినా.. అక్కడ కొత్తరకం స్ట్రెయిన్ విజృంభించడంతో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. మహమ్మారి వ్యాప్తిని నిరోధించడానికి రెండోసారి కఠినమైన లాక్‌డౌన్‌ను విధించారు. ప్రజలకు టీకాను అందించడంలో మిగతా ఐరోపా దేశాల కంటే బ్రిటన్ ముందు నిలిచినప్పటికీ, తదుపరి ఏంటన్న ప్రశ్న ప్రధాని బోరిస్ జాన్సన్ పై ఒత్తిడిని పెంచుతోంది. కోవిడ్-19 కట్టడికి సమర్థవంతంగా అమలు చేయడంలో ఇజ్రాయెల్ ప్రపంచానికే ఆదర్శంగా నిలిచింది. యూకేలో మాత్రం లాక్‌డౌన్ కారణంగా ఏర్పడిన నష్టాన్ని భర్తీ చేసేందుకు ప్రభుత్వం నానా అవస్థలూ పడుతోంది.

ఈ నేపథ్యంలో ప్రధాని బోరిస్ జాన్సన్, తన సహచరులతో మాట్లాడుతూ.. స్కూళ్లు, షాపింగ్ మాల్స్, థియేటర్లు, ఉద్యోగ కేంద్రాల్లో భారీఎత్తున నమూనాలను సేకరించి, పరీక్షలు జరిపించాలని, కోవిడ్‌తో సహజీవనం చేసేలా ప్రజలను సన్నద్ధం చేయాలని పేర్కొన్నారు. ఈ మేరకు నేడు జరగనున్న పార్లమెంట్ సమావేశంలో లాక్‌డౌన్, వ్యాక్సినేషన్ తదనంతర పరిస్థితులపై రోడ్ మ్యాప్‌ను సిద్ధం చేయాలని ఆయన సూచించారు.

నిత్యమూ వేలాదిగా పరీక్షలను నిర్వహించాలని, ముఖ్యంగా సెకండరీ పాఠశాలలకు వచ్చే విద్యార్థులపై దృష్టిని సారించాలని నిర్ణయించామని బ్రిటన్ విదేశాంగ శాఖ కార్యదర్శి డొమినిక్ రాబ్ తెలిపారు. రోజువారీ జీవితంలో కరోనా కూడా ఓ భాగమై పోయిందని, దాన్ని ఎదుర్కొంటూనే జీవనం సాగించాల్సి ఉంటుందని ఆయన అన్నారు.

కాగా, 1709లో బ్రిటన్‌లో సంభవించిన ‘గ్రేట్ ఫ్రాస్ట్’ తరువాత అత్యధిక మరణాలు కరోనా కారణంగానే సంభవించాయి. లాక్ డౌన్ కారణంగా ఐరోపాలో అత్యధికంగా నష్టపోయిన దేశాల్లో బ్రిటన్ కూడా ఉంది. ఇదే సమయంలో జన్యుమార్పిడితో మరింత వేగంగా వ్యాపించే స్ట్రెయిన్‌లుగా రూపాంతరం చెందడం ఆందోళన కలిగిస్తోంది. అందుబాటులో ఉన్న వ్యాక్సిన్‌లు కొత్త స్ట్రెయిన్‌లను ఏ మేరకు అడ్డుకుంటాయన్న విషయమై ఇంకా పూర్తి స్పష్టత రాలేదు.

ఈ నేపథ్యంలోనే వైరస్‌తో కలసి జీవించాలని ప్రజలకు సూచిస్తున్న బోరిస్ ప్రభుత్వం కోవిడ్-19 మార్గదర్శకాలను ప్రజలు తప్పనిసరిగా పాటిస్తూ మహమ్మారిని ఎదుర్కోవాలని చెబుతోంది. ఇంతకుమించి మరో మార్గం లేదని స్పష్టం చేస్తోంది. బ్రిటన్‌‌లో ఇప్పటి వరకూ 1.7 మిలియన్ల మందికి టీకా తొలి డోస్ అందజేశారు. అయితే, మహమ్మారి పెద్ద సంఖ్యలో ప్రజల ప్రాణాలను హరించడానికి గతంలో పరీక్షల నిర్వహణ విఫలం కావడమే కారణమని విమర్శకులు ఆరోపిస్తున్నారు.

ప్రస్తుతం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్న విషయం జాన్సన్‌కు అవగాహన ఉంది.. పాలక కన్జర్వేటివ్ పార్టీలోని చాలా మంది ఆర్థిక వ్యవస్థను త్వరగా తిరిగి పునఃప్రారంభించాలని పిలుపునిచ్చారు. ఆర్థిక వ్యవస్థకు జీవనాధారమైన రిటైల్ అమ్మకాలు జనవరిలో ఊహించిన దాని కంటే రెండు రెట్లు పడిపోయాయని శుక్రవారం ఒక నివేదిక తెలిపింది.

కొత్త కేసులు, మరణాలు తగ్గుముఖం పడుతున్నప్పటికీ జాగ్రత్తగా ముందుకు సాగాలని ప్రభుత్వం సంకేతాలు ఇచ్చింది. ఇప్పటికే పెద్ద వయస్కుల్లో నాలుగింట ఒక వంతు మందికి టీకాలు వేశారు. పాఠశాలల పునఃప్రారంభం, కేర్ హోమ్‌లో విజిటర్స్‌కు అనుమతి సహ పలు విభాగాలను మార్చి 8 నుంచి ప్రారంభించనున్నారు. విజిటర్స్ తప్పనిసరిగా పరీక్షలు చేసుకుని, మాస్క్ సహా పీపీఈ కిట్‌లు ధరించాలని ఆరోగ్య కార్యదర్శి మాట్ హాంకాక్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here