లవర్‌తో వధువు జంప్.. వరుడికి షాక్, ఆమె చెల్లెతో పెళ్లి.. మళ్లీ షాక్!

0
29పెళ్లికి ఘనంగా ఏర్పాట్లు చేశారు. బంధువులంతా వచ్చారు. మండపంలో పెళ్లి కుమారుడు వధువు రాక కోసం ఎదురుచూస్తున్నాడు. ముహూర్త సమయం దాటిపోతోంది.. అమ్మాయి ఎంతకీ రావడం లేదు. కాసేపటి తర్వాత అతిథులు ఏదో గుసగుసలాడుతున్నారు. అయినా.. వరుడు అలాగే కూర్చున్నాడు. కాసేపట్లో ఆమే వచ్చేస్తుందిలే అనుకున్నాడు. అనుకున్నట్టే వచ్చింది.. కానీ, పెళ్లికూతురు కాదు, ఓ వార్త. అమ్మాయి ఆమె ప్రియుడితో జంప్ అట..!

షాక్.. ఇప్పుడు ఏం చేయాలి? బంధువుల ముందు పరువు పోతుందేమో..! విషయం తెలిశాక కూడా ఆ గందరగోళంలో అబ్బాయి మండపంలో అలాగే కూర్చుండిపోయాడు. తన వాళ్లు ఏదో నిర్ణయం చెబుతారుగా.. అని ఎదురుచూస్తున్నాడు. ఇంతలో అమ్మాయి తరఫు వాళ్లు వచ్చారు.

‘బాబ్బాబూ.. అమ్మాయి రాత్రికి రాత్రే అలా వెళ్లిపోయింది. మాకు ఇప్పుడే తెలిసింది. ఈ పెళ్లి ఆగిపోతే అందరి ముందు మా పరువుపోతుంది. మీరు ఒప్పుకుంటే.. ఇదే ముహూర్తానికి చిన్నదాన్ని ఇచ్చి పెళ్లి చేస్తాం.. ఊ.. అనండి చాలు’ అని అమ్మాయి తరఫు వాళ్లు వేడుకున్నారు. పెళ్లికొడుకు తల్లిదండ్రులు కూడా తమకు అభ్యంతరం లేదని చెప్పడంతో అదే ముహూర్తానికి అమ్మాయి చెల్లెలితో పెళ్లికి ఏర్పాట్లు చేశారు.

ముహూర్తం కాస్త ఆలస్యమైనా.. మొత్తానికి పెళ్లి జరిగింది. వధూవరులిద్దరినీ అక్కడి నుంచి ఘనంగా సాగనంపారు. అక్క స్థానంలో చెల్లె అత్తారింట్లో కుడికాలు మోపింది. అందరూ హ్యాపీ.

ఇంతలో ప్రభుత్వ అధికారుల వాహనాలు రయ్‌మంటూ వరుడి ఇంటి వద్దకు దూసుకొచ్చాయి. అందులో నుంచి దిగిన అధికారులు నూతన వధూవరులిద్దరినీ కాసేపు ప్రశ్నించారు. ఆ తర్వాత అమ్మాయిని తమ వెంట తీసుకెళ్లిపోయారు. వరుడికి మళ్లీ షాక్!

చిన్నమ్మాయి వయసు 15 ఏళ్లే. కంగారులో అటు ఆడ పెళ్లివారు, ఇటు మగ పెళ్లివారు ఆమె మైనర్ అనే విషయం మరచిపోయారట. ఎలాగైతేనేం అనుకున్న ముహూర్తానికి పెళ్లి జరగాలని భావించారు. పంతం నెగ్గించుకుందామనుకున్నారు. పెద్దమ్మాయి తన లవర్‌తో వెళ్లిపోయినా, అదే మండపంలో చిన్నమ్మాయితో వివాహం జరిపించారు. కానీ, ఎంత బంధువులైనా కొంత మంది గిట్టని వాళ్లు ఉంటారుగా.. అధికారులకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చినట్టున్నారు. ఆ అబ్బాయికి టైమ్ కూడా బాలేనట్టుంది. శోభనానికి ఏర్పాట్లు చేస్తుండగా.. అధికారులు వచ్చి అమ్మాయిని తీసుకెళ్లారు.

పైగా ఆ అమ్మాయి టెన్త్ పరీక్షలకు సిద్ధమవుతోంది. అలాంటి బాలికకు పెళ్లెలా చేశారంటూ చైల్డ్ ప్రొటెక్షన్ అధికారులు చెడామడా తిట్టేశారు. అది బాల్య వివాహమని, ఆ పెళ్లి చెల్లదని తేల్చి చెప్పారు. ఆ అమ్మాయికి మరో మూడేళ్ల వరకు పెళ్లి ఊసే ఎత్తొద్దని ఆమె తల్లిదండ్రులకు వార్నింగ్ ఇచ్చారు. అమ్మాయి సంరక్షణా బాధ్యతలను ఆమె సోదరుడికి అప్పగించారు. ఈ ఘటన ఒడిశాలోని కలహండి జిల్లాలో బుధవారం (ఫిబ్రవరి 17) చోటు చేసుకుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here