రెడ్ RED

0
25హీరో రామ్‌కి లవర్ బాయ్‌గా మంచి ఇమేజ్ ఉంది.. కొన్నేళ్ల పాటు హిట్ ట్రాక్ తప్పినా.. ఇస్మార్ట్ శంకర్‌తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఇక రొటీన్ లవ్ స్టోరీలను పక్కన పెట్టి.. రెడ్ అనే క్రైమ్ థ్రిల్లర్‌తో కొత్త ప్రయోగానికి తెరతీశాడు రామ్. తమిళ చిత్రం ‘తడమ్’ను ‘రెడ్’గా రీమేక్ చేశారు. ఈ చిత్రంలో రామ్ డ్యూయల్ రోల్ పోషించడంతో పాటు.. నేను శైలజ, ఉన్నది ఒకటే జిందగీ, చిత్రలహరి వంటి వైవిధ్యభరిత ప్రేమ కథలతో మెప్పించిన దర్శకుడు కిషోర్ తిరుమల ఈ చిత్రానికి దర్శకత్వం వహించడంతో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఈ సినిమాలో ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.

సిద్ధార్థ్ (రామ్), ఆదిత్య (రామ్) ఐడెంటికల్ ట్విన్స్. ఇద్దరూ పోలికల్లోనే కాదు ఇద్దరి డీఎన్‌ఏ కూడా ఒకేలా ఉంటుంది. సోనియా అగర్వాల్, రవి ప్రేమించి పెళ్లి చేసుకుని అభిప్రాయ భేదాలతో విడిపోతారు. వీరిద్దరి సంతానమే సిద్ధార్థ్, ఆదిత్యలు. పేరెంట్స్ విడిపోవడంతో సిద్దార్థ్ తండ్రి వద్ద.. ఆదిత్య తల్లి వద్ద పెరుగుతాడు. ఆదిత్య తల్లికి పేకాట వ్యసనం ఉంటుంది. తనతో పాటు కొడుకుని కూడా పేకాట క్లబ్‌కి తీసుకుని వెళ్లి తన అలవాటుని మానుకోలేక ఇబ్బందుల్లో కూరుకుపోతుంది. దీంతో ఆదిత్య కోపం పెంచుకుంటాడు.

అదే సందర్భంలో కొడుకు కోసం తన వ్యసనాన్ని వదిలేసినా తల్లిని అర్థం చేసుకోలేకపోతాడు ఆదిత్య. జీవితంలో ఓడిపోయిన సోనీ అగర్వాల్ ఆత్మహత్య చేసుకుని చనిపోవడంతో తన సోదరుడు సిద్ధార్థ్, తండ్రి దగ్గరకు వెళ్లిపోతాడు ఆదిత్య. అయితే సిద్దార్థ్‌ని చూసుకున్నట్టుగా ఆదిత్యను చూసుకోలేకపోతాడు తండ్రి. దీంతో తండ్రి, సోదరుడుపై కోపం పెంచుకుని ఇంటి నుంచి బయటకు వచ్చేస్తాడు. పేకాట, గ్యాంబ్లింగ్, సెక్స్‌కి బానిస అవుతాడు ఆదిత్య. తన తల్లికోరిక మేరకు ఆదిత్య లా చేస్తే.. సిద్ధార్థ్ సివిల్ ఇంజనీర్ అయ్యి.. కన్‌స్ట్రక్షన్ కంపెనీకి ఎండీ అవుతాడు.

మహిమ (మాళవిక శర్మ)ను తొలి చూపుతోటే ప్రేమలో పడతాడు సిద్ధార్థ్. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని అనుకునే లోపు.. ఫ్రెండ్ పెళ్లి కోసం 15 రోజులు వేరే ఊరి వెళ్తుంది మహిమ. ఇంతలో సిద్దార్థ్ పేకాటలో తన మిత్రుడు వేమ (సత్య) ఎనిమిది లక్షల డబ్బుని పోగొడతాడు. దీంతో అతన్ని రౌడీలు బంధిస్తారు. ఆదిత్య డబ్బు కోసం ఎదురుచూస్తున్న తరుణంలో అనుకోని చిక్కుల్లో పడతాడు సిద్ధార్థ్.

ఆకాష్ అనే సంపన్న వర్గానికి చెందిన యువకుడు దారణంగా హత్య గావింపబడతాడు. ఈ నేరంపై సిద్ధార్థ్‌ని జైలులో పెడతారు. అదే సందర్భంలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుపడి అదే స్టేషన్‌కి వస్తాడు ఆదిత్య. ఈ కేసు విచారణ చేపట్టడానికి వస్తారు యామిని (నివేథా పేతురాజ్), నాగేంద్ర కుమార్ (సంపత్ రాజ్). అప్పటివరకూ సిద్దార్థ్ ఈ హత్య చేశాడని ఓ ఫొటో ఆధారంగా ప్రాథమిక అంచనాకు వచ్చిన పోలీస్‌లకు ఆదిత్యను చూసి షాక్ అవుతారు. డబ్బు కోసం ఆదిత్యే ఆకాష్‌ని హత్య చేశాడా?? లేక అదే పోలికలతో ఉన్న సిద్దార్థ్ హత్య చేశాడా? ఆకాష్ హత్యకి మహిమ కనిపించకుండా పోవడానికి లింక్ ఏంటి? ఇంతకీ మహిమ ఏమైంది?? గాయత్రి (అమృత అయ్యర్‌)‌కి ఈ కథతో లింక్ ఏంటి? అసలు సిద్ధార్థ్, ఆదిత్యలు ఒకరా?? లేక ఇద్దరా? అసలు హత్య చేసింది ఎవరు? ఎందుకు అనేదే మిగిలిన కథ.

క్రైమ్ మిస్టరీ, సస్పెన్స్ థ్రిల్లర్ కథలకు ప్రాథమిక సూత్రం ఆడియన్స్‌ని కథలో ఇన్వాల్వ్ చేయడం. నెక్స్ట్ ఏం జరుగుతుందన్న క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో కలిగించడం. ప్రేక్షకుల ఊహలకు ఆస్కారం ఇవ్వకుండా కథను మలిచారంటే దర్శకుడు సక్సెస్ అయినట్టే. అయితే ఈ క్రైమ్ మిస్టరీ కథను గాడిలో పెట్టడానికి ఫస్టాఫ్‌లో చాలా టైం తీసుకున్నాడు దర్శకుడు కిషోర్ తిరుమల. తొలి 45 నిమిషాలు అసలు కథని టచ్ చేయలేదు. అయితే ఎప్పుడైతే మర్డర్ జరిగిందో.. అప్పటి నుంచి కథపై ఆసక్తి పెరిగింది. కథలో మలుపులు.. ట్విస్ట్‌లతో ఆసక్తికరంగా మలిచాడు. ఇంటర్వెల్ బ్యాంగ్ సినిమాకి హైప్ ఇచ్చింది.

స్వతహాగా రచయిత కావడంతో ఈ కథకు కావాల్సిన స్టఫ్ తన కలం నుంచి సమకూర్చుకున్నాడు కిషోర్ తిరుమల. డైలాగ్స్ బాగున్నాయి. నచ్చింది తినాలనుకున్నా.. తినకపోతే ఏమౌతుందిలే అనుకునే బతుకులు వాళ్లవి. అంటూ మధ్యతరగతి వాళ్లపై రాసిన డైలాగ్ బాగా కనెక్ట్ అయ్యే విధంగా ఉన్నాయి. ఇలాంటి డైలాగ్‌లు సినిమాలో చాలానే ఉన్నాయి. రామాయణం మగాళ్లు కాకుండా ఆడాళ్లు రాసిఉంటే.. అనుమానం అనేది ఇప్పటికీ లేకుండా ఉండేది లాంటి గమ్మత్తైన డైలాగ్‌లతో ఆకట్టుకున్నాడు కిషోర్ తిరుమల.

మర్డర్ మిస్టరీ కథలోకి వెళ్లే కొలదీ థ్రిల్లింగ్ ట్విస్ట్‌లు, సర్ ప్రైజ్‌‌లతో కథ సాఫీగా సాగిపోతుంది. తొలి భాగం కాస్త స్లో నెరేషన్‌తో విసిగించినా.. సెకండాఫ్‌కి వచ్చేసరికి కథ గాడిలోకి వచ్చింది. అయితే మరీ కుర్చీల్లో కథలకుండా సినిమాలో ఇన్వాల్వ్ అయ్యే మ్యాజిక్ జరగలేదు కానీ.. కథనం కన్ఫ్యూజ్ లేకుండా ఉంది. అయితే ఆదిత్య, సిద్దార్థ్‌లలో స్క్రీన్‌పై కనిపించేది ఎవరు అన్న కన్ఫ్యూజన్ కొన్ని సందర్భాల్లో ఎదురౌతూ ఉంటుంది. ఇద్దరి హెయిర్ స్టయిల్, గెడ్డం సేమ్ టు సేమ్ ఉండటంతో గుర్తుపట్టడం కష్టంగా మారింది. కథ కోసం దర్శకుడు ఇలా స్క్రిప్ట్ రాసుకున్నా.. ఇద్దరికీ కాస్త వైవిధ్యం ఉంటే బాగుండని అనిపిస్తుంది.

డ్యుయెల్ రోల్‌లో రామ్ అదరగొట్టాడు. సిద్ధార్థ్ పాత్రలో సాఫ్ట్‌గా కనిపించి.. ఆదిత్య పాత్రలో ఊర మాస్‌గా అనిపించాడు. డించికి డించికి సాంగ్‌లో ఫుల్ ఎనర్జీతో డాన్స్ అదరగొట్టేశాడు. రామ్ పర్‌ఫార్‌మెన్సే సినిమాకు మేజర్ అట్రాక్షన్. ఇక హీరోయిన్లలో నివేదా పేతురాజ్ పోలీస్ ఆఫీసర్‌గా పర్ఫెక్ట్‌గా సూట్ అయ్యింది. రామ్‌కి జోడీగా నటించిన మాళవిక శర్మ, అమృత అయ్యర్ ఉన్నంతలో బాగానే చేశారు. నటనకు స్కోప్ ఉన్న పాత్రలు చేశారు. మాళవిక శర్మ‌-రామ్ రొమాన్స్ బాగా పండింది. లిప్ లాక్‌లతో హీటెక్కించారు. అమృత అయ్యర్ మధ్యతరగతి యువతిగా సూట్ అయ్యింది. సంపత్, పోసాని, నాజర్‌లవి చిన్న పాత్రలే.

ఇక ఈ సినిమాలో పవిత్ర ఆంటీ అపవిత్రమైన పాత్రలో కనిపించి సర్ ప్రైజ్ చేసింది. డబ్బున్న అంకుల్స్‌ని ట్రాప్‌లో పెడ్డడం.. మందు, సిగరెట్‌‌లు తాగుతూ రచ్చ చేసింది. కమెడియన్ సత్య తన పంచ్‌లతో నవ్వులు పంచాడు. ఇక డించిక్ డించిక్ ఐటమ్ సాంగ్‌లో హెబ్బా పటేల్ అందాల ఆరబోతను షురూ చేసింది. గ్లామర్ డోస్ పెంచి రామ్‌తో రచ్చ చేసింది.

ఇక టెక్నికల్ పరంగా సినిమా రేంజ్‌కి తగ్గట్టే ఉన్నాయి. స్రవంతి రవి కిషోర్, కృష్ణ చైతన్య నిర్మాణ విలువలు స్క్రీన్‌పై కనిపించాయి. మణిశర్మ బ్యాగ్రౌండ్ స్కోర్‌తో మరోసారి ఆకట్టుకున్నారు. డించిక్ డించిక్ సాంగ్‌కి మంచి మార్కులు పడగా.. మిగతా సాంగ్స్‌కి థియేటర్స్‌లో పెద్దగా రెస్పాన్స్ రాలేదు. సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ బాగుంది. ప్రతి ఫ్రేమ్ చాలా రిచ్‌గా అనిపిస్తుంది. పీటర్ హెయిన్ స్టంట్స్ బాగున్నాయి. ఎడిటర్ జునైద్ సిద్ధఖీ ఫస్టాఫ్‌లో ఓ పది నిమిషాలు తగ్గిస్తే రన్ టైమ్ క్రిస్పీగా అనిపించేది.

ఓవరాల్‌గా ‘రెడ్’ డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ. సస్పెన్స్ థ్రిల్లర్, క్రైమ్ మిస్టరీ చిత్రాలను ఇష్టపడేవారికి తప్పక నచ్చుతుంది. మరీ ఉత్కంఠభరితమైన క్రైమ్ థ్రిల్లర్ కాదు కానీ.. తప్పకుండా ఒక్కసారైతే చూడాల్సిన చిత్రమే ఈ రెడ్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here