రామ్ చరణ్‌తో క్వారంటైన్‌లో ఉపాసన: నాకూ పాజిటివ్ రావచ్చు.. మెగా కోడలు ఎమోషనల్ పోస్ట్

0
27మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కు కరోనా వైరస్ సోకిన విషయం తెలిసిందే. తనకు కొవిడ్-19 పాజిటివ్ వచ్చినట్టు మంగళవారం ఉదయం స్వయంగా సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. తనకు ఎలాంటి లక్షణాలు లేవని.. ప్రస్తుతం హోం క్వారంటైన్‌లో ఉన్నానని ఆయన వెల్లడించారు. అంతేకాకుండా ఈ మధ్య కాలంలో తనను కలిసినవారంతా తక్షణమే కొవిడ్-19 పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. వీలైనంత త్వరగా కోలుకుని మళ్లీ ప్రేక్షకుల ముందుకు వస్తానని తెలిపారు.

అయితే, రామ్ చరణ్‌కు కరోనా పాజిటివ్ వచ్చిన విషయం తెలియగానే మెగా అభిమానులు కంగారు పడ్డారు. దీనికి తోడు రామ్ చరణ్ సోదరుడు వరుణ్ తేజ్‌కు కూడా పాజిటివ్ రావడం మరింత కంగారు పెట్టింది. అయితే, భయపడాల్సిన అవసరం లేదని వీరిద్దరూ త్వరగా కోలుకుని తిరిగి షూటింగ్‌ల్లో పాల్గొంటారని మెగా కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే, రామ్ చరణ్‌కు కరోనా వైరస్ సోకడంపై ఆయన భార్య ఉపాసన సోషల్ మీడియా ద్వారా స్పందించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.

‘‘ఈ సంవత్సరం కూడా వెళ్లిపోతోంది. 2021 అయినా బాగుండాలని ఆశిస్తున్నాను. ఎలాంటి లక్షణాలు లేవు.. ఆయన చాలా దృఢంగా ఉన్నారు. నాకు నెగిటివ్ వచ్చింది. కానీ, నాకు కూడా కొవిడ్ పాజిటివ్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ప్రస్తుతం నేను మిస్టర్ సి (చరణ్‌ను ముద్దుగా ఇలా పిలుస్తారు)తో హోం క్వారంటైన్‌లో ఉన్నాను. వేడి ద్రావణాలు తీసుకుంటున్నాం. ఆవిరి పడుతున్నాం. విశ్రాంతి తీసుకుంటున్నాం’’ అని ఉపాసన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో పేర్కొన్నారు.

ఉపాసన పోస్ట్‌కి మెగా అభిమానులతో పాటు ప్రతి ఒక్కరూ పాజిటివ్‌గా స్పందిస్తున్నారు. ఇద్దరూ వీలైనంత త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. ‘‘మగధీరుడిలా వస్తాడు చరణ్.. ఇలాంటి వైరస్‌లు ఏం చేయలేవు’’ అని కొంత మంది మెగా అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. ఇదిలా ఉంటే, డిసెంబర్ 25న మెగా ఫ్యామిలీలోని రెండో తరం సభ్యులంతా క్రిస్మస్ వేడుకలు జరుపుకున్నారు. ఈ వేడుకలో పాల్గొన్న రామ్ చరణ్‌కు, వరుణ్‌కు కొవిడ్ పాజిటివ్ వచ్చింది. దీంతో మెగా అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here